Telugu Global
Telangana

భేటీ అయ్యారంతే!.. - షర్మిలపై రేణుకా ఫైర్

సోనియాతో భేటీ తర్వాత షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆమె ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను షర్మిల జస్ట్‌ కలిశారంతే .. వారి నుంచి ఎలాంటి హామీ రాలేదని రేణుకా చౌదరి చెప్పారు.

భేటీ అయ్యారంతే!.. - షర్మిలపై రేణుకా ఫైర్
X

చూస్తుంటే కాంగ్రెస్‌లోకి వెళ్లినా షర్మిల రాజకీయ జీవితం అంత సాఫీగా ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవైపు షర్మిల కోసం జగన్‌తో గొడవెందుకు అన్న ధోరణిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆమెపై గురి పెట్టారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాతో భేటీ తర్వాత షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆమె ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను షర్మిల జస్ట్‌ కలిశారంతే .. వారి నుంచి ఎలాంటి హామీ రాలేదని రేణుకా చౌదరి చెప్పారు. షర్మిలా ప్రకటనలు చేస్తే సరిపోదని.. హైకమాండ్‌ నుంచి ప్రకటన రావాలన్నారు.

అసలు షర్మిల ఇంత కాలం ఎక్కడ ఉన్నారు.. తెలంగాణ కోడలన్న విషయం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణకు షర్మిల కోడలు అయితే.. నేను తెలంగాణకు ఆడబిడ్డను.. మరేం చేద్దాం అంటూ రేణుకా ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో రాజకీయాలపై తన అభిప్రాయం కూడా కీలకమేనని చెప్పుకున్నారు. నాకు ఆంధ్రలో ఎంత హక్కు ఉందో.. ఇక్కడ షర్మిలకూ అంతేనన్నారు. అసలు కాంగ్రెస్‌లోకి వచ్చేవారు షర్మిల ఒక్కరేనా.. ఇంకా ఎవరైనా మిగిలారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో షర్మిల ఏ స్థానానైనా అడొచ్చు.. అడిగేందుకు ట్యాక్స్‌ లేదు కదా అంటూ సెటైర్లు వేశారు.

తొలి నుంచి షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాపై షర్మిల ఫోకస్‌ పెట్టడం రేణుకా చౌదరికి నచ్చలేదు. రాష్ట్రమంతా వదిలేసి పాలేరు మాత్రమే దొరికిందా అంటూ గతంలోనూ విమర్శలు చేశారు.


First Published:  3 Sep 2023 3:51 PM GMT
Next Story