Telugu Global
Telangana

రిమోట్ డెస్క్‌టాప్ షేరింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసి.. గ్రూప్-1 పేపర్ కొట్టేశారు!

ఈ కేసులో నిందితురాలిగా పేర్కొన్న షమీమ్ ఇంటిని సిట్ అధికారులు తనిఖీ చేశారు. గురువారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి ఒక ల్యాప్‌టాప్, మరో డెస్క్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.

రిమోట్ డెస్క్‌టాప్ షేరింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసి.. గ్రూప్-1 పేపర్ కొట్టేశారు!
X

టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ రూమ్ నుంచి క్వశ్చన్ పేపర్లు ఎలా బయటకు వచ్చాయనే విషయాన్ని ఆరా తీయగా.. సిట్ అధికారులకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. లీకేజీ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు.. గురువారం ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్‌లతో పాటు వారికి సహకరించిన షమీమ్, సురేశ్, రమేశ్ కుమార్‌లను కూడా విచారించారు. మిగతా ముగ్గురు చెప్పిన విషయాలను బట్టి.. క్వశ్చన్ పేపర్లను బయటకు తీసుకొని వచ్చింది రాజశేఖరే అని సిట్ అధికారులు నిర్దారించుకున్నారు.

కాన్ఫిడెన్షియల్ రూమ్‌లో క్వశ్చన్ పేపర్స్ ఉన్న సిస్టమ్‌లో 'Any Desk' అనే రిమోట్ డెస్క్‌టాప్ షేరింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు రాజశేఖర్ చెప్పారు. ఇందుకు షమీమ్ సహకరించిందని పేర్కొన్నాడు. తన బంధువులకు, ఇతరులకు షమీమ్ కంప్యూటర్‌ను ఉపయోగించి.. రాజశేఖర్ గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పంపాడని అధికారులు చెబుతున్నారు. న్యూజీలాండ్‌లో ఉన్న ప్రశాంత్ రెడ్డికి కూడా షమీమ్ కంప్యూటర్ నుంచే క్వశ్చన్ పేపర్ వెళ్లింది.

తనకు కేటాయించిన కంప్యూటర్ ఉపయోగించి క్వశ్చన్ పేపర్లు పంపితే.. తన బాస్ డిప్యూటీ సెక్రటరీకి తెలిసిపోతుందని రాజశేఖర్ భయపడ్డాడు. అప్పటికే షమీమ్ గ్రూప్-1 పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఆమెకు కూడా ప్రశ్నాపత్రం ఇస్తానని ప్రలోభపెట్టాడు. ఇతర ఉద్యోగులకు అనుమానం రాకుండా.. షమీమ్‌ను తీసుకొని కాన్ఫడెన్షియల్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రశ్నాపత్రాలు ఉన్న కంప్యూటర్‌లో ఎనీడెస్క్ యాప్ ఇన్‌స్టాల్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రశ్నాపత్రాలు రాజశేఖర్ దొంగిలించి పెన్ డ్రైవ్‌లో సేవ్ చేశాడు.

షమీమ్ కంప్యూటర్‌కు క్వశ్చన్ పేపర్లు ఉన్న పెన్ డ్రైవ్‌ను పెట్టి.. దాని యాక్సెస్ ఇవ్వగా.. న్యూజీలాండ్‌లో ఉన్న ప్రశాంత్ దాన్ని యాక్సెస్ చేసి ప్రశ్నాపత్రం తీసుకున్నాడు. ఇక ప్రవీణ్ కూడా రమేశ్ కుమార్‌కు ఎనీడెస్క్ ఉపయోగించే ప్రశ్నాపత్రాలు షేర్ చేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే, సురేశ్‌కు ఎనీడెస్క్ ఉపయోగించడం తెలియక పోవడంతో.. అతనికి ప్రింట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అయితే.. సురేశ్, రమేశ్.. ప్రవీణ్‌కు క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో వారి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకుండానే క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో నిందితురాలిగా పేర్కొన్న షమీమ్ ఇంటిని సిట్ అధికారులు తనిఖీ చేశారు. గురువారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి ఒక ల్యాప్‌టాప్, మరో డెస్క్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రమేశ్, ప్రవీణ్‌లకు చెందిన ఆఫీస్ కంప్యూటర్లను అధికారులు సీజ్ చేశారు. ఈ కొత్త ఎవిడెన్స్ కేసులో బలమైన సాక్ష్యంగా ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. షమీమ్, సురేశ్, రమేశ్ ఇచ్చిన సమాచారాన్ని వెరిఫై చేయడానికి టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని సిట్ అధికారులు గురువారం మళ్లీ కార్యాలయానికి పిలిచారు. కాగా, మరో మూడు రోజుల పాటు నిందితులను మరింత లోతుగా విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనా ఈ కేసులో ఉన్నారా అనే విషయాలపై కూడా ఆరా తీయనున్నారు.

First Published:  31 March 2023 2:12 AM GMT
Next Story