Telugu Global
Telangana

విశాఖ ఉక్కుకోసం బీఆర్ఎస్ పోరాటం న్యాయమా..? అన్యాయమా..?

విశాఖ ఉక్కు పోరాటంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని తక్కువచేసి చూడటానికి ఏమాత్రం వీలు లేదు. అలాంటి తెలంగాణ నుంచి ఇప్పుడు మళ్లీ మద్దతు వస్తుంటే, స్వాగతించాల్సింది పోయి అనుమానించడం ఎంతవరకు కరెక్ట్..?

విశాఖ ఉక్కుకోసం బీఆర్ఎస్ పోరాటం న్యాయమా..? అన్యాయమా..?
X

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయొద్దంటూ బీఆర్ఎస్ నినదించడంతో ఏపీలో చాలామందికి అనుమానం వచ్చింది. కేంద్రానికి ఎదురు చెప్పలేక ఏపీలోని అధికార ప్రతిపక్షాలు చప్పుడు చేయకుండా ఉన్న ఈ సందర్భంలో తెలంగాణ నుంచి వచ్చిన మద్దతుని చాలామంది అనుమానంగా చూశారు. బిడ్డింగ్ లో తెలంగాణ కూడా పాల్గొంటుందన్న వార్తలపై వైసీపీ నేతలు సెటైర్లు పేల్చారు. అందులో రాజకీయం దాగుందన్నారు. అసలు నిజమేంటి..? విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్ చొరవను అనుమానించాలా..? అభినందించాలా..?

"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు"

ఈ నినాదం మొదలైనప్పుడు కేవలం విశాఖ వాసులే కాదు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ వాదులు కూడా పోరాటంలో ముందు నిలిచారు. లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. జగిత్యాలలో జరిగిన ఫైరింగ్‌ లో ఇద్దరు మరణించారు. తెలంగాణ వ్యాప్తంగా వందల మంది పోలీస్ ఫైరింగ్, లాఠీచార్జిల్లో గాయపడ్డారు. వేలాది మంది అరెస్టై జైళ్లలో మగ్గారు. ఇదీ చరిత్ర. విశాఖ ఉక్కు పోరాటంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని తక్కువచేసి చూడటానికి ఏమాత్రం వీలు లేదు. అలాంటి తెలంగాణ నుంచి ఇప్పుడు మళ్లీ మద్దతు వస్తుంటే, స్వాగతించాల్సింది పోయి అనుమానించడం ఎంతవరకు కరెక్ట్.

జగిత్యాల, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ ఇలా తెలంగాణ ప్రాంతం అంతటా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఆనాడు ఆందోళనలు మిన్నంటాయి. మరోసారి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదని కేంద్రానికి అల్టిమేట్టం ఇచ్చింది. ఒకవేళ బిడ్డింగ్ అనివార్యమయితే, తాను కూడా పాల్గొనాలని నిర్ణయించింది. ప్రజా ఉద్యమం ఎక్కడ జరిగినా దానికి సంఘీభావంగా నిలబడడం తెలంగాణ మట్టిలోనే ఉన్న గుణం! అంటున్నారు తెలంగాణ వాదులు. ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతుని కూడా అలాగే చూడాలంటున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. తెలంగాణ నుంచి వస్తున్న మద్దతుకి అభినందనలు తెలిపేలా చేసింది.


విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో చాలా తీర్మానాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన నేతలు కూడా పేపర్లు పట్టుకుని ఢిల్లీ వెళ్లి ఇచ్చొచ్చారు. ఫలితం సున్నా. ప్రైవేటు పరం చేయడంలో ఎవరి మాటా వినం అంటున్నారు కేంద్రంలోని పెద్దలు. ఫ్యాక్టరీతోపాటు, దానికి ఉన్న వేలకోట్ల ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదెక్కడి న్యాయం అని అడిగేందుకు ఇక్కడి నాయకులకు నోరు పెగలదు. పక్క రాష్ట్రం నుంచి మద్దతు వస్తే, రాజకీయ లాభం అంటూ విమర్శలు చేసేందుకు మాత్రం గొంతు చించుకుంటున్నారు.

First Published:  11 April 2023 11:56 AM GMT
Next Story