Telugu Global
Telangana

బండిసంజయ్ పై బీజేపీ దళిత నాయకుల తిరుగుబాటు

ఈ రోజు కరీంనగర్ కు చెందిన పలువురు దళిత నేతలు బండి సంజయ్ వ్యవహార శైలిపై ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు. పార్టీలో అనేక ఏళ్ళుగా పని చేస్తున్న దళితులను బండి సంజయ్ అణ‌గదొక్కుతున్నారని, డబ్బులు ఇచ్చినవాళ్ళకే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.

బండిసంజయ్ పై బీజేపీ దళిత నాయకుల తిరుగుబాటు
X

బీజేపీ తెల‍ంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార తీరుపై ఆ పార్టీలో రచ్చ మొదలైంది. ఎప్పటి నుంచో బండి సంజయ్ పై అంతర్గతంగా రగిలిపోతున్న అనేక మంది నాయకులు ప్రస్తుతం బహిరంగంగానే గొంతు విప్పుతున్నారు.

మొన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, నిన్న పేరాల శేఖర్ రావులు బండి సంజయ్ పై ధ్వజమెత్తగా ఈ రోజు కరీంనగర్ కు చెందిన పలువురు దళిత నేతలు బండి సంజయ్ వ్యవహార శైలిపై ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు. పార్టీలో అనేక ఏళ్ళుగా పని చేస్తున్న దళితులను బండి సంజయ్ అణ‌గదొక్కుతున్నారని, డబ్బులు ఇచ్చినవాళ్ళకే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.

కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కన్నం అంజయ్య తో సహా పలువురు బీజేపీ నాయకులు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. బండి సంజయ్ కుమార్, దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని అంజయ్య అన్నారు.

ఉమ్మడి జిల్లాలో దళితుల, సీనియర్ నాయకుల పట్ల సంజయ్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితులలో మాదిగ వర్గానికి పదవులు ఇవ్వకుండా బండి సంజయ్ కుమార్ అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బీజేపీ చేపట్టబోయే ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ ను సీనియర్ నాయకులు, దళిత నాయకులు నిలదీస్తారని హెచ్చరించారు. 20 ఏళ్లుగా బీజేపీ ని నమ్ముకుని ధర్మపురి నియోజకవర్గంలో పని చేస్తుంటే డబులున్నాయన్న కారణంగా కాంగ్రెస్ నుండి వచ్చిన వివేక్ ను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించకుంటే అధిష్టానం వద్దనే తేల్చుకుంటామని అంజయ్య స్పష్టం చేశారు. బండి సంజయ్ డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని , డబ్బులిచ్చే నాయకులనే ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

First Published:  14 March 2023 8:16 AM GMT
Next Story