Telugu Global
Telangana

సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు, ప్రభావాలు

లాక్ డౌన్ అనాలోచిత చర్య అని, దానివల్ల లక్షలాదిమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వందల మైళ్ల దూరం కాలినడకన వెళ్లారని, మార్గమధ్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు దేశపతి శ్రీనివాస్.

సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు, ప్రభావాలు
X

భారత ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలేనని మండిపడ్డారు తెలంగాణ వికాస సమితి సభ్యులు. ఈ సమితి ఆధ్వర్యంలో 'సంక్షోభంలో భారత ఆర్ధిక వ్యవస్థ.. కారణాలు, ప్రభావాలు అనే అంశంపై కీలక సదస్సు జరిగింది. దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సమితి సభ్యులతోపాటు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి గల కారణాలు వివరించారు.

Advertisement

ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ దారుణంగా పడిపోవటం వంటి కారణాల వల్ల విదేశీ మారక ద్రవ్య నిలువలు భారత్ లో దారుణంగా పడిపోయాయని అన్నారు దేశపతి శ్రీనివాస్. దేశంలో ఉద్యోగ కల్పన శాతం నలభైఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని చెప్పారు. కరోనా విపత్తు నియంత్రణలో విఫలమైన కేంద్రం, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకు మతవిద్వేషాలు రెచ్చగొట్టిందని మండిపడ్డారాయన. ఇది బీజేపీ వికృత మానసిక ధోరణికి నిదర్శనం అని విమర్శించారు. లాక్ డౌన్ అనాలోచిత చర్య అని, దానివల్ల లక్షలాదిమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వందల మైళ్ల దూరం కాలినడకన వెళ్లారని, మార్గమధ్యంలో చాలామంది ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇది అత్యంత విషాదకర సంఘటన అని అన్నారు. రైలు పట్టాలపై కార్మికుల దేహాలు ఛిద్రమైన సంఘటన మానని గాయం అని చెప్పారు. కరోనా తర్వాత ఆర్థిక ఉద్దీపన చర్యల్లోనూ కేంద్రం విఫలమైందని అన్నారు దేశపతి శ్రీనివాస్.

Advertisement

డీమానిటైజేషన్ పెద్ద తప్పు..

బ్రిటన్ ని అధిగమించి భారత్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినా కూడా.. తలసరి ఆదాయంలో బ్రిటన్ పౌరులు మనకంటే 20రెట్లు అధిక సంపాదనతో ఉన్నారని గుర్తు చేశారు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్. భారత్ లో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని, దేశంలో ఉన్న 20శాతం సంపద, కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లో ఉందని వివరించారు. దొంగనోట్ల పనిపడతామని, నల్లధనం వెలికి తీస్తామని.. ఆ డబ్బులు ప్రజలకు పంచుతామని తప్పుడు ప్రచారం చేసి పెద్దనోట్లను రద్దు చేశారని, కానీ ఆ తర్వాత నాలుగేళ్లు జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచీ దారుణంగా పడిపోయిందని అన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. డీమానిటైజేషన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కలిగిన 1.8 లక్షల కోట్ల నష్టాన్ని పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచడం, అధిక పన్నులతో ప్రజలనుంచే వసూలు చేశారని చెప్పారాయన. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని నీతి ఆయోగ్ సూచీలు వెల్లడిస్తున్నాయని, ప్రపంచ ఆహార సూచికలో 107వ స్థానానికి పడిపోవడం భారత్ పేదరికానికి నిదర్శనం అని చెప్పారు.

ఆచార వ్యవహారాలపై ఆంక్షలు..

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో లౌకికవాదం, సామ్యవాదం, సమానత్వం అనే పదాలు మాట్లాడటమే తప్పుగా మారిందని విమర్శించారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. మతాచారాలపై కూడా నిషేధం కొనసాగుతోందని, స్వేచ్ఛ హరించుకుపోయిందని చెప్పారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనం అయిన భారత్ లో భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని అన్నారు. వివక్షకు గురైన వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని, వ్యక్తులను శాసించే సంస్థల ప్రాతిపదికన దేశంలో పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయత అంటే హిందూ మతీకరణ కాదన్నారు చక్రపాణి.

ప్రజల మధ్య విభజన రేఖ గీస్తూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని వక్తలు తమ సందేశాన్ని వినిపించారు. ఈ సమావేశంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సమన్వయ కర్త ఒంటెద్దు నరసింహా రెడ్డి, సభ్యులు జి.వెంకటేశ్వర్లు, హెచ్.రవీందర్, విజయానంద్, భిక్షపతి నాయక్, వెంకన్న, రూబి తదితరులు పాల్గొన్నారు.

Next Story