Telugu Global
Telangana

నేను బతుకున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదు కేసీఆర్

''35 లక్షల కోట్ల అస్తులున్న ఎల్ ఐ సీ ని అమ్మేస్తామంటున్నరు. ప్రజల సొత్తును షావుకార్లకు అప్పజెప్తామంటే మనం తిరగబడాలె. కరెంట్ ప్రైవేటీ కరిస్తరట. వాళ్ళకిష్టమైన షావుకార్ల‌కిస్తరట. ఇది పెట్టుబడిదార్ల రాజ్యమైతది తప్ప ప్రజల రాజ్యంకాదు.'' అని మోడీని విమర్శించారు కేసీఆర్.

నేను బతుకున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదు కేసీఆర్
X

తాను బతికున్నంత కాలం రైతు బంధు, రైతు బీమా ఆగబోదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ రోజు జగిత్యాల పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ధర్మపురి నర్సింహ స్వామి దయ వల్ల తెలంగాణ సాధించుకున్నామని, అక్కడ గోదావరి పుష్క‌రాలు నిర్వహించుకున్నామని కేసీఆర్ తెలిపారు. గోదావరి ముందుగా తెలంగాణలోనే ప్రవహించినా తెలంగాణలో గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరని తాను సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలతో పోరాటం చేశానన్నారు కేసీఆర్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి వంద కోట్లు సాంక్షెన్ చేస్తున్నట్టు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.

స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజల కోరిక మేరకు జగిత్యాల జిల్లాలోని బండలింగాపూర్ ను మండలంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు కేసీఆర్.

ఈ జిల్లాలో వరద కాలువ కష్టాలు తనకు తెలుసునని , వరద కాలువపై దాదాపు 16 వేల మోటార్లున్నాయని వాటికి ఒక్క పైసా కూడా లేకుండా ఫ్రీగా 24 గంటలు విద్యుత్తు ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు పెడదామా అని ప్రజలను ప్రశ్నించారు.

మన చుట్టు అనేక మంది అనేక మాటలు చెప్పి మనను ఆగం చేస్తారు. వారి మాటలు విన్నామంటే మన జీవితాలు ఆగమయిపోతాయి. మనం జాగ్రత్తగా ఉండాలే. తెలంగాణ బాగయినట్టే దేశం కూడా బాగ్గావాలె, మనం అధికారంలోకి వచ్చినప్పుడే ప్రధాని మోడీ కూడా అధికారంలోకి వచ్చారు. మనం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి అభివృద్ది చేశాం. ఆగమైన రైతుల బతుకులు బాగుచేయాలని రైతు బంధు, రైతు బీమా, ఫ్రీ కరెంట్, ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇలా ప్రతి ధాన్యం గింజను ఇంటి దగ్గరనే కొనే రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సమైక్య రాష్ట్రంలో బీడీ కార్మికుల గోస‌ ఎవరూ పట్టించుకోలే. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నప్పటికీ ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి వందల కోట్లతో నెలకు 2వేల 16 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డులు, పిల్లలకు ఫ్రీ చదువులు, ఆరోగ్య శ్రీ సేవలు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటివెన్నో ఇస్తున్నాం. ప్రతి వర్గాన్ని అభివృద్ది చేశాం. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో, అభివృద్దిలో తెలంగాణ నెంబర్ 1. మరి మోడీ ఏం చేశారు ? ఏదైనా రంగంలో అభివృద్ది చేశాడా? మేకిన్ ఇండియా అని నినాదం ఇచ్చిన మోడీ అటువైపు భారత్ ను నడిపించాడా ? పిల్లల బాణా సంచా, పతంగులు, దీపాలు, చివరకు జాతీయ జెండా కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇదేనా మేకిన్ ఇండియా? ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వకూడదట. కానీ 14 లక్షల కోట్లు పెట్టుబడి దారుల అప్పులు మాఫీ జేశారు.'' అని మోడీని విమర్శించారు కేసీఆర్.

''35 లక్షల కోట్ల అస్తులున్న ఎల్ ఐ సీ ని అమ్మేస్తామంటున్నరు. ప్రజల సొత్తును షావుకార్లకు అప్పజెప్తామంటే మనం తిరగబడాలె. కరెంట్ ప్రైవేటీ కరిస్తరట. వాళ్ళకిష్టమైన షావుకార్ల‌కిస్తరట. ఇది పెట్టుబడిదార్ల రాజ్యమైతది తప్ప ప్రజల రాజ్యంకాదు. అంగన్ వాడీ నిధులకు కోతపెట్టి, బేటీ పడావ్ బేటీ బచావ్ అనే మాటలు మాట్లాడటంలో అర్దముందా ?. మత పిచ్చిల పడి కొట్టుక పోతే నష్టపోతం. పది వేల పరిశ్రమలు మూతబ‌డ్డయ్. 50 లక్షల కార్మికుల ఉద్యోగులు ఊడినయ్. ఏడాదికి 10 వేల పెట్టుబడిదారులు దేశాన్ని విడిచి వెళ్తున్నరు. దేశంలో ఏం జరుగుతుందో, మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చకుపెట్టాలె.'' అని కేసీఆర్ ప్రజలను కోరారు.

''మనం మోసపోవద్దు. భారత భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలే. ప్రధాని స్వంత రాష్ట్రంలో కరెంట్ లేదు. రాజధాని ఢిల్లీ లో ప్రజలకు తాగడానికి నీళ్ళు లేవు. ఇలాంటి భారత్ కోసమేనా స్వాతంత్రపోరాటంలో వీరులెందరో త్యాగం చేసింది. ఒక్క తెలంగాణ బాగుపడితే సరిపోదు దేశ‌మంతా బాగుపడాలె. ఆనాడు తెలంగాణ నాయకత్వం చేసిన చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్ళు గోస పడ్డం. మల్లా పొరపాట్లు చేయొద్దు. ఈ గోల్ మాల్ గోవిందం గాళ్ళ మాటలు నమ్మొద్దు. మళ్ళీ బాధపడొద్దు.'' అని కేసీఆర్ అన్నారు.

First Published:  7 Dec 2022 11:49 AM GMT
Next Story