Telugu Global
Telangana

ఏపీ కుక్కలు చించిన విస్తరి.. అందుకే 'బీఆర్ఎస్' లోకి..

ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు రావెల కిషోర్ బాబు. తోట చంద్రశేఖర్ తనకు మంచి స్నేహితుడని, గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలసి పనిచేశామన్నారు.

Ravela Kishore Babu
X

రావెల కిషోర్ బాబు

బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కుక్కలు చించిన విస్తరిలా తయారైందని, అందుకే బీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని చెప్పారాయన. కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు తనను బాగా ఆకర్షించాయని, అందుకే బీఆర్ఎస్ కి జై కొడుతున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని, ఈ ఆధిపత్య పోరులో రాష్ట్రం నాశనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి జై..

ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానులనేది హాట్ టాపిక్. దీనిపై బీఆర్ఎస్ అభిప్రాయం ఏంటనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ లో చేరుతున్న రావెల కిషోర్ బాబు అమరావతికి పరోక్షంగా జై కొట్టారు. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. తోట చంద్రశేఖర్ తనకు మంచి స్నేహితుడని, గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలసి పనిచేశామన్నారు. ఇప్పుడు కూడా ఒకే పార్టీలో కొనసాగుతామని వెల్లడించారు. కాంగ్రెస్ లాగే ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు రావెల. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను బీజేపీ అణిచివేయలని చూస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీకి దేశ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటానని, బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు రావెల కిషోర్ బాబు.

ఏపీ పార్టీల్లో వణుకు..

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇంత ఘనంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కీలక నేతలు, అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు, దళిత నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం కచ్చితంగా కనపడే అవకాశముంది. అయితే బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఏ పార్టీ పూర్తి స్థాయిలో మునిగిపోతుందో చూడాలి.

First Published:  2 Jan 2023 8:45 AM GMT
Next Story