Telugu Global
Telangana

పోటీకి రంజిత్‌ రెడ్డి విముఖత.. చేవెళ్లలో అభ్యర్థి కోసం BRS వేట

ఇప్పటికే నియోజకవర్గ కీలక నేతలు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్‌ రెడ్డిలతో కేటీఆర్ సమావేశమై ఇదే అంశంపై చర్చించారు.

పోటీకి రంజిత్‌ రెడ్డి విముఖత.. చేవెళ్లలో అభ్యర్థి కోసం BRS వేట
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ నేతలు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. కొందరు సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు నేతలు పోటీ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

చేవెళ్ల నుంచి మరోసారి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కాగా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రంజిత్ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రంజిత్‌ రెడ్డి పోటీ చేయకపోతే ఎవరిని బరిలో ఉంచాలనే దానిపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే నియోజకవర్గ కీలక నేతలు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్‌ రెడ్డిలతో కేటీఆర్ సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని వీరికి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి రేసులో కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు వీరేశ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించగా.. 2019 ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గెలిచారు.

First Published:  4 March 2024 6:09 AM GMT
Next Story