Telugu Global
Telangana

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సర్వేలో రామగుండం కార్పొరేషన్‌ టాప్

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ పెద్దపల్లి సభలో కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధిని ప్రకటించడమే కాకుండా, పలు వరాలు కూడా కురిపించారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సర్వేలో రామగుండం కార్పొరేషన్‌ టాప్
X

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో చేపట్టిన సర్వేలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్‌ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో భాగంగా సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో రామగుండం నూటికి నూరు మార్కులు సాధించింది. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సింగరేణి సంస్థకు చెందిన కార్యాలయాలు కూడా రామగుండంలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే రామగుండం కార్పొరేషన్‌గా మారింది. అప్పటి నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ పెద్దపల్లి సభలో కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధిని ప్రకటించడమే కాకుండా, పలు వరాలు కూడా కురిపించారు. టీఆర్ఎస్ పరిపాలనలో ఉన్న కార్పొరేషన్‌లో మేయర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రామగుండం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం అర్భన్ ఔట్ కమ్ ఫ్రేమ్ వర్క్స్‌లో భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ను రూపొందించడానికి ఈ సర్వే చేపట్టింది.

సిటీ లెవెల్ బోర్డ్ ఫర్ సీపీఎస్ యాక్టివిటీస్ 2022 పేరుతో ఈ సర్వే చేపట్టగా.. దానికి సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేశారు. తెలంగాణ నుంచి రామగుండం కార్పొరేషన్ మాత్రమే 100కు 100 మార్కులు సాధించి చోటు దక్కించుకున్నది. ఈ సర్వే వల్ల నగరంలో జీవన నాణ్యతకు సంబంధించి పౌరుల అవగాహన, వారి అభిప్రాయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.

సర్వేలో ప్రచార అవగాహన కొరకు బిల్ బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి 10 మార్కులు, పోర్టర్లకు 10, కంపెన్‌కు 10, రెఫరల్ సర్వే ప్రమోషన్‌కు 20, ప్రింట్ మీడియాకు 10, డిజిటల్ మీడియాకు 10, ఇన్నోవేటీవ్, ఇన్సియేటీవ్‌కు 20 చొప్పున కేటాయించగా.. అన్నింటిలోనూ ఫుల్ మార్కులు తెచ్చుకున్నది.

రామగుండానికి ఈ గుర్తింపు రావడానికి శ్రమపడిన అర్బన్ ఔట్ కమ్ ఫ్రేమ్ వర్క్ నోడల్ అధికారి, డిప్యుటీ కమిషనర్‌ నారాయణరావు, సిబ్బందిని.. మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ సుమన్ రావు అభినందించారు.

First Published:  1 Feb 2023 8:56 AM GMT
Next Story