Telugu Global
Telangana

మునుగోడులో మళ్లీ ఘర్షణ.. కారణం ఏమిటంటే..

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరసన చేపట్టిన ప్రాంతం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

మునుగోడులో మళ్లీ ఘర్షణ.. కారణం ఏమిటంటే..
X

ఎన్నిక ముగిసినా మునుగోడు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. ఇటీవల ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్.. బీజేపీ మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్‌లో ఫైట్ జరిగిన విషయం తెలిసిందే. చివరకు టీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందింది.

ఇదిలా ఉంటే సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. గొల్లకురుమలకు గొర్రెల పథకం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు మండల కేంద్రంలోని చౌరస్తాలో నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ఈ క్రమంలో మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ చౌరస్తా వద్దకు చేరుకుంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరసన చేపట్టిన ప్రాంతం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే.

మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఇంకా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజు వివిధ మీడియా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డబ్బు, మద్యం పంపిణీ అధికార దుర్వినియోగం వల్లే తాను ఓడిపోయానని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ వాళ్లే ఈ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధనదాహం వల్లే .. ఈ ఎన్నిక వచ్చిందని టీఆర్ఎస్ వాళ్లు ఆరోపిస్తున్నారు.

First Published:  14 Nov 2022 10:39 AM GMT
Next Story