Telugu Global
Telangana

రాజగోపాల్ అన్నా.. తొందర పడకు, మాట జారకు : ఎమ్మెల్సీ కవిత

రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌కు వెంటనే కవిత కౌంటర్ ఇచ్చారు.

రాజగోపాల్ అన్నా.. తొందర పడకు, మాట జారకు : ఎమ్మెల్సీ కవిత
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా తొందరపడి మాట జారవద్దని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదే పదే సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని బీజేపీ అబద్దపు ప్రచారం చేస్తోంది. ఇటీవల మునుగోడులో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే ప్రచారాన్ని నెత్తిన పెట్టుకున్నారు. తెలంగాణ, బీఆర్ఎస్‌పై వ్యతిరేక వార్తలు రాసే ఓ పత్రిక కథనాన్ని బుధవారం ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. లిక్కర్ స్కామ్ చార్జి షీటులో కవిత పేరు 28 సార్లు పేర్కొన్నారని ట్వీట్ చేశారు.

రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌కు వెంటనే కవిత కౌంటర్ ఇచ్చారు. ''రాజగోపాల్ అన్నా.. తొందరపడకు, మాట జారకు! 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా.. అబద్దం నిజం కాదు'' అని ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ఈ కేసు విషయంలో ఆప్ నేత, ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును కూడా ఇలాగే పదే పదే ప్రస్తావించేలా చేసింది. కానీ చివరకు అతడికి క్లీన్ చిట్ లభించింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత పేరును కూడా చేర్చి.. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌కు కూడా కవిత సమాధానం చెప్పారు. ఠాకూర్ కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత పేరును ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. దీనికి కవిత స్పందిస్తూ.. నాపై చేసిన ఆరోపణలు అన్నీ బోగస్, అబద్దాలే. నా చిత్త శుద్దిని కాలమే నిర్ణయిస్తుంది. ఇది బీజేపీ రాజకీయంగా చేస్తున్న రాద్దాంతం. బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడి ఇలాంటి ఎత్తులు వేస్తోంది. వారి రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల ప్రభుత్వ అజెండాను ఎక్కడ బయటపెడతారో అని బీజేపీ ఇలా కుట్రలు చేస్తోందని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.




First Published:  21 Dec 2022 6:02 AM GMT
Next Story