Telugu Global
Telangana

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ఇటు బీఆర్ఎస్ పాలన చూస్తే పరీక్ష పేపర్ల లీక్.. అటు కేంద్రంలో ప్రధాని మోడీ పాలనంతా ఆర్థిక నేరాలమయంగా మారిందని అశోక్ గెహ్లాట్ విమర్శించారు.

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
X

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుండడంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పొరుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను సైతం తెలంగాణకు రప్పించి ప్రచారం చేయిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హైదరాబాద్‌కు వచ్చారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్‌లపై విమర్శలు చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు బీఆర్ఎస్ పాలన చూస్తే పరీక్ష పేపర్ల లీక్.. అటు కేంద్రంలో ప్రధాని మోడీ పాలనంతా ఆర్థిక నేరాలమయంగా మారిందని విమర్శించారు. బడా వ్యాపారులు బ్యాంకుల్లో కోట్లాది రూపాయల అప్పుచేసి విదేశాలకు పారిపోయారని చెప్పారు. వారు ఎగవేసిన రూ.కోట్ల అప్పులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని మండిపడ్డారు.

దేశంలోని సంపాదనంతా దోచుకునే పార్టీలు ఒకవైపున ఉన్నాయని, కాంగ్రెస్ మాత్రం ప్రజల పక్షాన నిలిచి ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని అశోక్ గెహ్లాట్ తెలిపారు. కాగా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని కొద్ది రోజులుగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  28 Nov 2023 11:44 AM GMT
Next Story