Telugu Global
Telangana

రాజయ్యకు ఇంకా ఆశ పోలేదు.. కడియంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు

కడియం శ్రీహరితో తాను ఇంకా కలిసిపోలేదని.. కార్యకర్తలు అపోహ పడవద్దని చెప్పారు. జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడిన రాజయ్య.. ప్రగతిభవన్‌లో ఏమీ జరగలేదన్న రీతిలో స్పందించారు.

రాజయ్యకు ఇంకా ఆశ పోలేదు.. కడియంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు
X

తాటికొండ రాజయ్య ఇంకా దింపుడు కళ్లెం ఆశలతో ఉన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్ టికెట్ కడియం శ్రీహరికి ప్రకటించిన దగ్గర నుంచి అసమ్మతి గళం వినిపిస్తున్న రాజయ్య.. రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌కు వెళ్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్ సమక్షంలో కడియంతో రాజీపడుతున్నట్లు చెప్పారు. ఉప్పు నిప్పుగా ఉండే కడియం, రాజయ్యలు ఒకరినొకరు కౌగిలించుకొని కలిసిపోయామనే సంకేతాలు పంపారు. మంత్రి కేటీఆర్ కూడా భవిష్యత్‌లో సముచిత స్థానం ఇస్తామని రాజయ్యకు చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సమావేశం జరిగి రెండు రోజుల కూడా గడవక ముందే రాజయ్య మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కడియం శ్రీహరితో తాను ఇంకా కలిసిపోలేదని.. కార్యకర్తలు అపోహ పడవద్దని చెప్పారు. జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడిన రాజయ్య.. ప్రగతిభవన్‌లో ఏమీ జరగలేదన్న రీతిలో స్పందించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశాను. ఆయనతో కాసేపు మాట్లాడారు. అదే సమయంలో కేటీఆర్ దగ్గర కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే కలిసి ఫొటో మాత్రమే దిగామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కార్యకర్తలు ఎలాంటి అపోహకు గురి కావొద్దని సూచించారు.

అధిష్టానం నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాల్సి ఉన్నది. 2018లో ఎలా అయితే స్టేషన్‌ ఘన్‌పూర్ కార్యకర్తలను కలిపే కార్యక్రమం జరిగిందో.. ఇపపుడు కూడా అలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ 115 టికెట్లు ప్రకటించారు. అయితే నివేదికలు, సర్వే రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులూ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు టికెట్ ప్రకటించిన స్థానాల్లో బీ-ఫామ్‌లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

టికెట్లు కేటాయించే సమయంలో మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. అందుకే ఇప్పుడు వెళ్లి కలిశాను. చాలా బాగా పని చేస్తున్నావు.. టికెట్ నీకే అని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు మీడియాకు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ, ఎంపీ పదవిని కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. తాటికొండ రాజయ్య వ్యాఖ్యలతో ఘన్‌పూర్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొన్నది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో చూస్తే.. అక్కడ కడియం, రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చినట్లే కనపడింది. ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని మరీ ఆ వీడియోలో కనపడ్డారు. కానీ ఇప్పడు హఠాత్తుగా రాజయ్య మాట మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య కావాలనే గందరోళ పరిస్థితులు సృష్టిస్తున్నట్లు నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా టికెట్ సాధించాలనే కుట్రతోనే రాజయ్య ఇలా వ్యవహరిస్తున్నట్లు కడియం మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పటికే టికెట్ మరొకరికి కేటాయించినా.. కార్యకర్తల్లో కన్ఫ్యూజన్‌కు గురి చేసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచిస్తున్నారు.

First Published:  24 Sep 2023 2:45 PM GMT
Next Story