Telugu Global
Telangana

రాజగోపాల్‌కు షాక్ తప్పదా?

బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ పోటీ చేస్తున్న విషయం పట్టణ ప్రాంతంలోని జనాల్లో రిజిస్టర్ అయ్యింది. అయితే గ్రామాల్లో ఇంకా పూర్తిగా రిజిస్టర్ కాలేదన్న విషయం ప్రచారంలో బయటపడిందట.

రాజగోపాల్‌కు షాక్ తప్పదా?
X

బీజేపీ అభ్యర్థిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి షాక్ తగిలే ఘటనలు ఎదురయ్యాయట. నామినేషన్ వేయకముందు నుంచే రాజగోపాల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా అభ్యర్ధి ఒకవైపు ప్రచారం చేసుకుంటుంటే బాధ్యతలు తీసుకున్న నేతలు మరోవైపు ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా కొందరు సీనియర్ నేతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయట. బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ పోటీ చేస్తున్న విషయం పట్టణ ప్రాంతంలోని జనాల్లో రిజిస్టర్ అయ్యింది.

అయితే గ్రామాల్లో ఇంకా పూర్తిగా రిజిస్టర్ కాలేదన్న విషయం ప్రచారంలో బయటపడిందట. ప్రచారంలో భాగంగా నేత‌లు వృద్ధులు, కొందరు మహిళలతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి ఓట్లేయమని అడిగారట. అందుకు వారు రాజగోపాలరెడ్డి తమకెందుకు తెలీదు కాంగ్రెస్ లీడరే కదా? అని ఎదురు ప్రశ్నించారట. మరికొన్ని చోట్ల బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాజగోపాలరెడ్డికి ఓట్లేసి గెలిపించమని చెప్పినపుడు తప్పకుండా హస్తం పార్టీకే ఓట్లేస్తామని జనాలు చెప్పారట.

ఈ రెండు ఘటనల ద్వారా కమలనాధుల‌కు అర్ధమయ్యిందేమంటే రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీజేపీ తరపున ఉపఎన్నికలో పోటీచేస్తున్నారనే విషయం ఇంకా చాలా మందిలో రిజిస్టర్ కాలేదని. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తమకు పెద్ద షాక్ తగలటం ఖాయమని అర్ధమైపోయిందట. రాజగోపాల్‌కు కాంగ్రెస్‌తో సంబంధం లేదని ఇప్పుడు బీజేపీలో చేరి పోటీ చేస్తున్నట్లు జనాలందరికీ వివరంగా చెప్పకపోతే పోలింగ్ రోజున కొంపమునిగే ప్రమాదముందని టెన్షన్ మొదలైంది.

అందుకనే బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేస్తున్న పోస్టర్లను, క‌ర‌ప‌త్రాల‌ను ప్రతి గ్రామంలోని ఇంటింటికి తిరిగి పంచాలని కమలనాధులు డిసైడ్ అయ్యారు. ఒకటికి రెండు సార్లు ప్రచారం చేయటంతో పాటు వ్యక్తిగతంగా వృద్ధులకు, మహిళలకు అర్ధమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకనే క‌ర‌ప‌త్రాల‌ను ప్రతిఇంటికి అంటించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇంట్లో యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళకి అర్ధమయ్యేట్లుగా చెప్పించాలని అనుకుంటున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.

First Published:  12 Oct 2022 7:41 AM GMT
Next Story