Telugu Global
Telangana

ఉపఎన్నికకు రాజగోపాల్ రెడ్డి సై.. బీజేపీకి కావల్సింది అదే కదా.!

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ పాలన‌ నుంచి విముక్తి చేసే దిశగా తాను అడుగులు వేస్తున్నానని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉపఎన్నికకు రాజగోపాల్ రెడ్డి సై.. బీజేపీకి కావల్సింది అదే కదా.!
X

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో కొనసాగించడంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఇష్యూలో టీపీసీసీ రెండు వర్గాలుగా విడిపోవడంతో.. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయంలో అధిష్టానం కల్పించుకున్నా.. బీజేపీలో చేరడానికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆహ్వానించినా, ఆయన వెళ్లలేదు. మరోవైపు మనుగోడు ఉపఎన్నికకు తాను సిద్దమనే సంకేతాలను రాజగోపాల్ ఇచ్చారు.

బీజేపీలో చేరుతున్నాననే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో ఎక్కడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు గానీ, బీజేపీలో చేరుతున్నట్లు గానీ పేర్కొనలేదు. అయితే తన పోరాటం కేసీఆర్‌పైనే అని స్పష్టం చేశారు. వందల మంది ఆత్మబలిదానాలతో, సబ్బండ వర్గాల పోరాటాలతో పురుడు పోసుకున్న తెలంగాణను కేసీఆర్ సొంత కుటుంబ ఆస్తిగా మార్చుకున్నారని రాజగోపాల్ ఆరోపించారు.

మునుగోడు నియోజకవర్గంపై కక్షగట్టి మూడున్నర ఏళ్లుగా నాతో పాటు, నియోజకవర్గ ప్రజలను కూడా కేసీఆర్ అవమానపరిచారని పేర్కొన్నారు. 2014 కంటే ముందే ఎస్ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తయినా.. నన్ను గెలిపించారనే వాటిని పక్కన పెట్టారని ఆరోపించారు. మునుగోడును కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలాగ అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పానని రాజగోపాల్ పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ పాలన‌ నుంచి విముక్తి చేసే దిశగా తాను అడుగులు వేస్తున్నానని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నా సొంత అవసరాల కోసమో, పదవుల కోసమో చేస్తున్న పోరాటం కాదు.. ఈ విషయంలో వెనకడుగు వేయడం నా రక్తంలో లేదని కోమటిరెడ్డి వివరించారు. ప్రజా ప్రభుత్వం దిశగా మునుగోడు వేదికగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు రాజ‌గోపాల్ అందులో వివరించారు.

రాజగోపాల్ రాసిన బహిరంగ లేఖను పరిశీలిస్తే.. ఆయన రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ టికెట్‌పై ఉపఎన్నికలో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీకి కూడా ఇప్పుడు కావల్సింది అదే. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునగోడును ప్రీ ఫైనల్ లాగా భావించాలని అనుకుంటుంది.

ఒకవేళ ఉపఎన్నిక వస్తే అది టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందిగా మారనున్నది. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఓడినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయితే అక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. అధికార పార్టీలో ఉత్సాహం పెరుగుతుంది. అంతే కాకుండా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ, సిట్టింగ్ సీటును నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్‌కు కూడా తిప్పలు తప్పవు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలపై పై చేయి సాధించడం కాంగ్రెస్‌కు సవాలు లాంటిదే. ఓడితే.. సిట్టింగ్ సీటు పోగొట్టుకోవడమే కాకుండా.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు కార్యకర్తలు డీలా పడే అవకాశముంది. ఏదేమైనా మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయితే తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది.

First Published:  30 July 2022 6:06 AM GMT
Next Story