Telugu Global
Telangana

నేటి నుంచి జమ కానున్న 'రైతు బంధు'.. కొత్తగా 5 లక్షల మంది పోడు రైతులకు..

ప్రస్తుతం రైతు బంధు 11వ విడత కింద నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు రూ.72,910 కోట్లు రైతు బంధు కింద సాయం చేశారు.

నేటి నుంచి జమ కానున్న రైతు బంధు.. కొత్తగా 5 లక్షల మంది పోడు రైతులకు..
X

అన్నదాతల ఖాతాల్లో నేటి నుంచి 'రైతు బంధు' సాయం జమ కానున్నది. వానాకాలం సాగుకు పెట్టుబడి సాయంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ మేరకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఇందుకు అవసరమైన రూ.7,720.29 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఇవ్వాళ్టి నుంచి రైతల ఖాతాల్లోకి వ్యవసాయ శాఖ నగదు జమ చేయనున్నది. కాగా, ఈ సీజన్‌లో కొత్తగా 5 లక్షల మంది పోడు రైతుల ఖాతాల్లో కూడా ఈ పథకాన్ని వర్తింప చేయనున్నది. దీంతో గతంలో కంటే ఈ సారి రూ.300 కోట్ల అదనపు భారం పడనున్నది.

ప్రస్తుతం రైతు బంధు 11వ విడత కింద నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు రూ.72,910 కోట్లు రైతు బంధు కింద సాయం చేశారు. ఈ సీజన్‌లో 1.54 ఎకరాలకు పంట సాయం అందనున్నది. కాగా, కొత్తగా రైతు బంధు సాయం తీసుకోవాలనుకునే రైతులు.. తమ బ్యాంకు ఖాతా వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నందుకు రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి సరఫరాతో రైతులు సంతోషంగా ఉన్నారని.. ఇది కేసీఆర్‌కు రైతుల పట్ల ఉన్న ఆప్యాయతకు నిదర్శనమని మంత్రి చెప్పారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎంత ఖర్చైనా రైతులు నష్టపోకూడదని కేసీఆర్ ఆలోచిస్తారని మంత్రి చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన సాగు నీటితో అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే.. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.

First Published:  26 Jun 2023 2:21 AM GMT
Next Story