Telugu Global
Telangana

కాంగ్రెస్ లో మళ్లీ వైఎస్ఆర్ ఫార్ములా

రాజశేఖర్ రెడ్డ బతికి ఉంటే ఇప్పుడు దేశంలోని సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేవారని అన్నారు దిగ్విజయ్ సింగ్. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఇబ్బంది పడుతున్న సమయంలో పాదయాత్రతో పార్టీకి కొత్తజీవం పోశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ లో మళ్లీ వైఎస్ఆర్ ఫార్ములా
X

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్ కి దూరమైంది. దీంతో సహజంగానే ఆయన జ్ఞాపకాలు కూడా కాంగ్రెస్ కి దూరమయ్యాయి. ఆయన జయంతి, వర్థంతి కార్యక్రమాలకు కాంగ్రెస్ పెద్దగా ప్రాధాన్యమిచ్చేది కాదు. ఇక ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగయ్యే సరికి ఆయన గురించి మాట్లాడేవారు కూడా లేరు. రాష్ట్ర విభజనకు వైఎస్ఆర్ వ్యతిరేకి అనే ముద్ర ఉంది కాబట్టి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ప్రస్తావన పెద్దగా తెచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కి వైఎస్ఆర్ ఆక్సిజన్ కాబోతున్నారని తెలుస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గరవుతుండటంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. తాజాగా ‘రైతే రాజైతే’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ సంస్మరణ సభలా జరిగింది. ఆయన వర్థంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.


కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి సంయుక్తంగా రాసిన పుస్తకం ‘రైతే రాజైతే’. హైదరాబాద్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా వచ్చారు. వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతుని రాజు చేయడానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశాడని చెప్పుకొచ్చారు నేతలు. ఉచిత విద్యుత్ వంటి పథకాలు తెరపైకి తెచ్చి రైతులకు మేలు చేసింది వైఎస్ఆర్ అని అన్నారు.

ఆయనే ఉండి ఉంటే..

రాజశేఖర్ రెడ్డ బతికి ఉంటే ఇప్పుడు దేశంలోని సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేవారని అన్నారు దిగ్విజయ్ సింగ్. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఇబ్బంది పడుతున్న సమయంలో పాదయాత్రతో కొత్తజీవం పోశారని గుర్తు చేశారు. మొత్తమ్మీద వైఎస్ఆర్ కి, కాంగ్రె కి ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఆయనతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనేది వైఎస్ఆర్ కల అని, ఆ కల నెరవేర్చేందుకు అందరం కృషి చేద్దామన్నారు.

షర్మిల ఎంట్రీతో..

జగన్ జైలుకి వెళ్లిన తర్వాత.. కాంగ్రెస్ కి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. వైఎస్ఆర్ పేరుని సీబీఐ కేసుల్లో చేర్చడానికి, జగన్ పై కేసులు పెట్టడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణం అనే ప్రచారం ఉంది. అయితే అది తప్పు అంటున్నారు షర్మిల. ఇటీవల ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలసి వచ్చిన ఆమె.. కాంగ్రెస్ తెలియక చేసిన తప్పు అదని అన్నారు. వారు పశ్చాత్తాపంతో ఉన్నారని, అందుకే తాను కాంగ్రెస్ కి దగ్గరవుతున్నానని వివరణ ఇచ్చుకున్నారు. షర్మిల ఎంట్రీతో వైఎస్ఆర్ అభిమానులంతా మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతారనే అంచనాలున్నాయి.

First Published:  3 Sep 2023 2:37 AM GMT
Next Story