Telugu Global
Telangana

మక్తల్ టూ జుక్కల్.. రాహుల్ యాత్రలో రోజుకో టీం

అక్టోబర్ 23న మక్తల్ నియోజకర్గంలోని కృష్ణ గ్రామం వద్ద రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు పెడతారు. అక్కడి నుంచి 14 రోజుల్లో 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి జుక్కల్ వద్ద మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతారు.

మక్తల్ టూ జుక్కల్.. రాహుల్ యాత్రలో రోజుకో టీం
X

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' మరో 11 రోజుల్లో తెలంగాణలో అడుగుపెట్టనున్నది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే ఈ నెల 23న రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ వర్గాలు ఇంతకు ముందు వెల్లడించాయి. ఒకవైపు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉన్నా.. యాత్రను విజయవంతం చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి ఈ యాత్ర తప్పకుండా ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఫిక్స్ అయ్యింది. ఏ నియోజకవర్గంలో ఏయే నేతలు వెంట నడవాలి, పాదయాత్రలో ప్రజలు ఎప్పుడు కలవాలనే విషయాలు కూడా కూలంకషంగా చర్చించారు.

అక్టోబర్ 23న మక్తల్ నియోజకర్గంలోని కృష్ణ గ్రామం వద్ద రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు పెడతారు. అక్కడి నుంచి 14 రోజుల్లో 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి జుక్కల్ వద్ద మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతారు. మక్తల్ టూ జుక్కల్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తెలంగాణ పోలీస్ బందో బస్తు ఏర్పాట్లు నిర్వహించనున్నది. ఇప్పటికే డీజీపీ మహేందర్ రెడ్డితో కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. దీపావళి ముగిసిన తర్వాత ఈ నెల 26 నుంచి పూర్తి స్థాయి యాత్ర ప్రారంభం కానున్నది.

ప్రతీ రోజు ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభించి 10 గంటల లోపు ముగిస్తారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం ప్రజలతో మమేకం అవుతూ సాయంత్రం యాత్ర కొనసాగిస్తారు. ఉదయం పూట పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు.. సాయంత్రం సామాన్య ప్రజలు పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు. రాహుల్ వెంట నడిచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీమ్ ప్రతీ రోజు మారిపోతుందని తెలుస్తున్నది. రోజులో బృందం రాహుల్ వెంట ఉంటుందని.. ఇప్పటికే ఆయా బృందాలను ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే రాహుల్ ఈ యాత్ర చేపట్టారు. మోడీ ప్రభుత్వ అరాచక పాలన, నిరుద్యోగ సమస్య కూడా రాహుల్ ఎజెండాలో ఉన్నది. అందుకే సాయంత్రం పూట ప్రజలను కలిసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని టీపీసీసీ చెప్తోంది.

రాహుల్ యాత్రకు సంబంధించి మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. రాహుల్ యాత్ర విజయవంతం చేయడమే అజెండాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. రాహుల్ యాత్రలో పాల్గొనాల్సిన కార్యకర్తలు, నాయకులు లిస్టును సిద్దం చేశారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు రాహల్ యాత్రను కూడా విజయవంతం చేయాలని సమావేశంలో నాయకులు నిర్ణయించారు.



First Published:  12 Oct 2022 12:59 PM GMT
Next Story