Telugu Global
Telangana

నాపై 24 కేసులున్నాయి.. ఒవైసీపై ఎన్ని కేసులున్నాయి..?

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానం అని, బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్ జోడో యాత్ర సమయంలో తాను చూశానన్నారు రాహుల్.

నాపై 24 కేసులున్నాయి.. ఒవైసీపై ఎన్ని కేసులున్నాయి..?
X

బీజేపీ, ఎంఐఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. నాంపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. మన దేశ సంస్కృతి అది కాదన్నారు. ప్రేమను పంచాలనే లక్ష్యంతో తాను భారత్‌ జోడో యాత్ర చేశానన్నారు రాహుల్ గాంధీ. తనను బీజేపీ ఎన్నోరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసిందని చెప్పారు. కానీ తాను ఎక్కడా వెనక్కు తగ్గలేదని, దేశం కోసం ఏ విషయంలోనూ రాజీపడబోనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.


దేశవ్యాప్తంగా కేసులు..

తనపై దేశ వ్యాప్తంగా కేసులు పెట్టి వేధించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు రాహుల్ గాంధీ. పరువు నష్టం కేసు వేసి తన లోక్‌ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, చివరకు తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లేలా చేశారన్నారు. అయినా కూడా తాను ఏనాడూ మోదీతో కాంప్రమైజ్ కాలేదని వివరణ ఇచ్చారు రాహుల్ గాంధీ. తనపై 24 కేసులు ఉన్నాయని, ఎంఐఎం అధినేత ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వాళ్లపై ఈడీతో కేసులు పెట్టించారని, ఒవైసీపై ఎందుకు ఉండవని అడిగారు. ఒవైసీ మోదీకి రహస్య స్నేహితుడన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం పని చేస్తుందన్నారు రాహుల్. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌ తోనే ఎంఐఎం తమ అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే ఎంఐఎం నేతలు ఏంచేసినా వారిపై కేసులు ఉండవని చెప్పారు రాహుల్.

2024లో ఢిల్లీలో మోదీని ఓడించాలంటే తెలంగాణలో ముందు బీఆర్ఎస్ ను ఓడించాలన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ బీసీ వ్యక్తిని సీఎం చేస్తామంటోందని ముందు ఆ పార్టీ 2 శాతం ఓట్లు తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కు బీఆర్ఎస్‌ తోనే పోటీ అని చెప్పారు.ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానం అని, బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్ జోడో యాత్ర సమయంలో తాను చూశానన్నారు రాహుల్.


First Published:  28 Nov 2023 8:20 AM GMT
Next Story