Telugu Global
Telangana

మునుగోడులో గెలుపు మార్గాలను అన్వేషించండి.. నేతలకు రాహుల్ సూచన

మునుగోడు విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ ఇమేజ్‌ను కాపాడాలని టీపీసీసీ నాయకులకు సూచించినట్లు సమాచారం.

మునుగోడులో గెలుపు మార్గాలను అన్వేషించండి.. నేతలకు రాహుల్ సూచన
X

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇటీవల బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ పార్టీ పాత పేరు మీదనే పోటీ చేయనుంది. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పేరు మీద పోటీ చేయబోయే చివరి వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని చెప్పవచ్చు. బీజేపీ కూడా ఇప్పటికే స్టీరింగ్ కమిటీలు వేసి ప్రచారాన్ని ఉధృతం చేసింది. గ్రామ గ్రామాన కీలకమైన లీడర్లతో మంతనాలు సాగిస్తూ.. ఓట్లు వేయించుకునే పనిలో పడింది. అయితే సిట్టింగ్ స్థానాన్ని గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గంలో సాంప్రదాయంగా వస్తున్న ఓట్లు ఉన్నాయి. వీటిని కాపాడుకుంటూనే తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మునుగోడు విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ ఇమేజ్‌ను కాపాడాలని టీపీసీసీ నాయకులకు సూచించినట్లు సమాచారం. ఇటీవల భారత్ జోడో యాత్ర తెలంగాణకు సంబంధించిన రూట్ మ్యాప్‌‌ను సిద్ధం చేయడానికి కొంత మంది కేరళ వెళ్లారు. అంతకు ముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా కేరళలో రాహుల్‌ను కలిశారు. మునుగోడు ఉపఎన్నికపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో పార్టీ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గెలుపు కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కుటుంబానికి మునుగోడులో మంచి పట్టు ఉంది. గతంలో ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 27 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఆమె సొంత ఇమేజ్‌తో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కూడా కలసి వస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా తెలంగాణలో కొనసాగనుంది. ఆయన తెలంగాణలో పాదయాత్రలో ఉన్న సమయంలోనే మునుగోడు ఫలితాలు వస్తాయి. ఓటమి పాలైతే పాదయాత్రపై ప్రత్యర్థి పార్టీలు తప్పకుండా దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. రాహుల్ తెలంగాణలో పాదయాత్ర చేసినా కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారనే అపవాదు కూడా మూటగట్టుకోవల్సి వస్తుంది

అందుకే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు గాను శంషాబాద్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పోలింగ్ తేదీ నాటికి ప్రతీ గడపకు రెండు సార్లు వెళ్లి ఓటర్లను కలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. పార్టీలో విభేదాలను వీడి సీనియర్ నాయకులు కొన్ని రోజులు మునుగోడులోనే ఉండేలా ప్లాన్ చేసుకోనున్నారు. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని మండలాల్లో స్వయంగా క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న గ్రామస్థాయి నాయకులు పార్టీని వీడకుండా వారిని బుజ్జగించాలని, భవిష్యత్‌లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భరోసా ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తానికి రాహుల్ సూచన మేరకు మునుగోడులో సీనియర్లు ఐక్యంగా పని చేస్తారా? లేదంటే ఎప్పటిలాగే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారా అనేది వేచి చూడాలి.

Next Story