Telugu Global
Telangana

సర్జరీ చేసి వేలిముద్రలు మారుస్తున్న కేటుగాళ్లు..

ఈ ముఠా హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు సడన్ రైడ్ చేశారు. సర్జరీ చేయించుకున్న ఇద్దరితోపాటు, ముఠా స‌భ్యుల‌ను కూడా అరెస్ట్ చేశారు. వీరు ఆపరేషన్ చేస్తే ఏడాది వరకు ఫింగర్ ప్రింట్ వేరే విధంగా మారిపోయి ఉంటుంది.

సర్జరీ చేసి వేలిముద్రలు మారుస్తున్న కేటుగాళ్లు..
X

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు సరిపోలవని అంటారు. అందుకే నేరవిచారణలో వేలిముద్రలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు, ఈ డిజిటల్ యుగంలో సంతకం కంటే వేలిముద్రలపైనే కంప్యూటర్లకి కూడా నమ్మకం ఎక్కువ. అలాంటి వేలిముద్రలకు కూడా ఫోర్జరీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఈ ముఠా ఏపీ కేంద్రంగా తమ కార్యకలాపాలను నడుపుతోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణాల వల్ల అక్కడ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవారు తిరిగి వెళ్లాలంటే వేలిముద్రల సమస్య ఏర్పడుతోంది. అలాంటివారిని వెతికిపట్టుకుని వారి వేలిముద్రలను మార్చేసి తిరిగి గల్ఫ్ దేశాలకు ఈ ముఠా పంపిస్తోంది. వేలిముద్రలు మార్చినందుకు 25వేలు ఫీజు వసూలు చేస్తుంది ఈ ముఠా.

గల్ఫ్ వెళ్లేందుకు వేలిముద్రలు రిజెక్ట్ కావడంతో ఆపరేషన్ చేయించుకుంటున్నారు కొంతమంది యువకులు. ఏడాది పాటు వేలిముద్రలు కనబడకుండా కొత్త తరహా సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ అనంతరం దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఇలా సర్జరీ చేయించుకున్న యువకులను, ఆ సర్జరీలు చేసే డాక్టర్ ని అరెస్ట్ చేశారు మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు.

వేలిముద్రల సర్జరీ చేసే ముఠాకు పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కడపకు చెందిన ఎక్స్ రే ల్యాబ్ టెక్నీషియన్ నాగ మునీశ్వర్ రెడ్డి, అనస్థీషియా టెక్నీషియన్ వెంకట రమణ, కువైట్ లో కన్‌ స్ట్రక్షన్ వర్క్ చేసి తిరిగొచ్చిన శివశంకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఇంటి దగ్గరికి వెళ్లి మరీ వీరు సర్జరీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా 11 మందికి సర్జరీ చేసింది. రాజస్థాన్ లో ఇద్దరు, కేరళలో ఆరుగురు, కడపలో ముగ్గురికి సర్జరీ చేశారు.

ఈ ముఠా హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు సడన్ రైడ్ చేశారు. సర్జరీ చేయించుకున్న ఇద్దరితోపాటు, ముఠా స‌భ్యుల‌ను కూడా అరెస్ట్ చేశారు. వీరు ఆపరేషన్ చేస్తే ఏడాది వరకు ఫింగర్ ప్రింట్ వేరే విధంగా మారిపోయి ఉంటుంది. సర్జరీ చేసుకున్న వారు మూడు నెలల తరువాత కువైట్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడాదికి వీరికి పాత ఫింగర్ ప్రింట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ అప్పుడు చెకింగ్స్ జరిగితే వీరంతా దొరికిపోతారు. అలా దొరికినవారికి కువైట్ లో వారం రోజుల జైలుశిక్ష వేసి తిరిగి పంపించేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ఇమ్మిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేశామన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. కువైట్ ఎంబసీ అధికారులకు కూడా సమాచారం అందిస్తామని చెప్పారు.

First Published:  1 Sep 2022 1:22 PM GMT
Next Story