Telugu Global
Telangana

నెల రోజుల ముందుకు యాసంగి సీజన్.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

రైతులకు అవగాహన కల్పించి, వారిని చైతన్య పరిచేందుకు పటిష్టమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని సబ్ కమిటీ తీర్మానించింది.

నెల రోజుల ముందుకు యాసంగి సీజన్.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
X

తెలంగాణలో సీజన్ల వారీగా పంట కాలంలో మార్పులు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. దీనిపై అధ్యయనం చేయడానికి, సరైన పరిష్కారం సూచించడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల బారి నుంచి పంటలను రక్షించడం, రైతులకు నష్టం కలుగకుండా చూడటంపై చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ.. పంట కాలాన్ని దాదాపు నెల రోజుల పాటు ముందుకు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించి, వారిని చైతన్య పరిచేందుకు పటిష్టమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని సబ్ కమిటీ తీర్మానించింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇతర అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వీరి సూచనల మేరకు యాసంగి పంటను మూడు నుంచి నాలుగు వారాల పాటు ముందుకు జరిపితే.. అకాల వర్షాల నుంచి పంటలను రక్షించవచ్చని నిర్ణయించారు.

మార్చి చివరి వారం కల్లా యాసంగి పంట కోతలు పూర్తయయేలా రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తులు, నిపుణులు సూచించారు. యాసంగి సాగులో యాజమాన్య పద్దతులు, తక్కువ కాలంలో.. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ దిగుబడి వచ్చే వరి రకాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో రైతులకు సాగు నీరు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర అందిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయింది. కానీ, అకాల వర్షాల వల్ల పంటలు పాడయి.. రైతులకు నష్టం వాటిల్లుతోందని మంత్రులు చెప్పారు.

యాసంగి వరి పంట కోతలు ఆలస్యం అవుతుండటం వల్లే అకాల వర్షాల కారణంగా రైతులు ప్రతిఏటా నష్టపోతున్నారని.. ఇది రైతులకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టమే అని వారు చెప్పారు. దీన్ని నివారించడానికే పంట కాలాన్ని ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు చెప్పారు. 3-4 వారాలు ముందు జరపడంపై సమగ్ర అధ్యయనం చేసి, ఎలాంటి విధానాలు అవలంభించాలో సమగ్ర నివేదిక ఇవ్వాలని.. తర్వాతి సమావేశంలో మరింత లోతుగా చర్చ జరుపుదామని సబ్ కమిటీ నిర్ణయించింది.

First Published:  25 May 2023 3:30 AM GMT
Next Story