Telugu Global
Telangana

ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో ప్రశ్నాపత్రాలు.. సిట్ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం

ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో గతంలో జరిగిన పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, ఇతర ఆధారాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో ప్రశ్నాపత్రాలు.. సిట్ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం
X

తెలంగాణలో సంచలనం రేపుతున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసులు లోతుగా విచారిస్తున్న కొద్దీ అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ కలిసి గతంలో చాలా పేపర్లు లీక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరి ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించగా కీలకమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తున్నది.

ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో గతంలో జరిగిన పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, ఇతర ఆధారాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. వారి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లలో పేపర్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు చేస్తున్న కొందరు గ్రూప్-1 పరీక్షలు కూడా రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి వివరాలన్నీ సిట్ అధికారులు సేకరిస్తున్నారు. కమిషన్‌లో పని చేస్తున్న 8 మంది ఉద్యోగులు గ్రూప్-1 పరీక్ష రాశారని.. వీరందరికీ 150 మార్కులకు గాను 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఆధారాలను బేస్ చేసుకొని మంచి ర్యాంకులు వచ్చిన వారిని సిట్ అధికారులు హిమాయత్‌నగర్‌లోని కార్యాలయానికి పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వీరిలో చాలా మందికి ప్రవీణ్ క్వశ్చన్ పేపర్ అమ్మకానికి పెట్టినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితులు అందరూ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. వారందరినీ విడివిడిగా.. కలిపి విచారిస్తూ ఒక్కో ఆధారాన్ని సేకరిస్తున్నారు.

పేపర్ల లీకేజీ కేసులో నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయాయి. ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్తకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన లావాదేవీల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇక టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర లక్ష్మిని కూడా సిట్ అధికారులు విచారించారు.

శంకర లక్ష్మి కొన్ని కీలకమైన విషయాలను సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ వివరాల ఆధారంగా ఇవ్వాళ ప్రవీణ్‌ను సిట్ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. కమిషన్ కార్యాలయంలో పని చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రధాన నిందితులతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని సిట్ అధికారులు ఆరా తీస్తుననారు. వారి కాల్ డేటా ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తుననారు.

ఇక ఈ వ్యవహారంలో పలు ఆరోపణలు చేసిన బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే సిట్ పోలీసులకు అందించాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులు అందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

First Published:  22 March 2023 8:54 AM GMT
Next Story