Telugu Global
Telangana

రాజకీయాల్లో యాక్టీవ్ కానున్న పీవీ నర్సింహారావు చిన్న కొడుకు

కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోయినా స్వయంగా సీఎం కేసీఆర్.. పీవీ శతజయంతి ఉత్సవాలు జరిపారు. ఆ ఉత్సవ కమిటీలో పీవీ ప్రభాకర్ రావును సభ్యుడిగా చేశారు.

రాజకీయాల్లో యాక్టీవ్ కానున్న పీవీ నర్సింహారావు చిన్న కొడుకు
X

మాజీ ప్రధాని పీవీ సర్సింహారావు చిన్న కొడుకు పీవీ ప్రభాకర్ రావు క్రీయాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. పీవీ నర్సింహారావు సంతానంలో పీవీ రాజేశ్వరరావు గతంలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. ఇక కూతురు సురభి వాణీదేవి టీఆర్ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇక ఇప్పుడు పీవీ ప్రభాకర్ రావు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత పీవీ నర్సింహారావుదే. అయితే సోనియా గాంధీతో ఉన్న విభేదాల కారణంగా ఆయన గాంధీ కుటుంబానికి దగ్గర కాలేక పోయారు. ఆయన చనిపోయిన తర్వాత కనీసం ఢిల్లీలో కనీస గౌరవం దక్కలేదు. దీంతో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల పీవీ కుటుంబం కోపంగానే ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోయినా స్వయంగా సీఎం కేసీఆర్.. పీవీ శతజయంతి ఉత్సవాలు జరిపారు. ఆ ఉత్సవ కమిటీలో పీవీ ప్రభాకర్ రావును సభ్యుడిగా చేశారు. అప్పట్లో బయట కనిపించిన ప్రభాకర్ రావు ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఇండస్ట్రియలిస్ట్ అయిన పీవీ ప్రభాకర్ ఇక ఇప్పుడు రాజకీయాల్లో చురుకుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తొలుత కాంగ్రెస్‌లో చేరతారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఇటీవల భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. పీవీఎన్ఆర్ మార్గ్‌లో నడిచిన రాహుల్.. నర్సింహారావు విగ్రహాం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.

ఈ విషయంలో పీవీ ప్రభాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్, డి. శ్రీధర్ బాబు కలిసి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ పీవీ. ప్రభాకర్ రావు మాత్రం మనసు మార్చుకోలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో చేరి రాజకీయాలు చేసే ఛాన్సే లేదని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు పీవీ ప్రభాకర్ ఏ పార్టీలో చేరతారనే విషయంపై చర్చ జరుగుతున్నది.

పీవీ ప్రభాకర్‌తో టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు టచ్‌లో ఉన్నట్లు పీవీ గ్లోబల్ ఫౌండేషన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాకర్ రావు సోదరి ఇప్పటికే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక ఆయన మేనల్లుడు ఎన్వీ సుభాశ్ ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మామయ్యను బీజేపీలోకి తీసుకొని రావడానికి సుభాశ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, టీఆర్ఎస్ అయితేనే తనకు అనుకూలంగా ఉంటుందని ప్రభాకర్ భావిస్తున్నారు.

ఇటీవల మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతరులు చాలా మంది టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్తున్న వేళ ఢిల్లీలో అవసరమయ్యే నాయకులను వెతికే పనిలో పడ్డారు. పీవీ ప్రభాకర్‌కు ఢిల్లీలో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ వెంట నడిస్తేనే మంచిదని ప్రభాకర్‌కు సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు. పైగా పీవీ నర్సింహారావుకు సముచిత గౌరవం ఇచ్చింది కేసీఆరే. దీంతో పీవీ ప్రభాకర్ రావు బీజేపీ కంటే టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

First Published:  17 Nov 2022 3:42 AM GMT
Next Story