Telugu Global
Telangana

మిషన్ కాకతీయపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు రానున్న పంజాబ్ నిపుణుల బృందం

ముగ్గురు సభ్యుల బృందానికి బల్లోవల్ సౌంఖ్రీలోని ప్రాంతీయ పరిశోధనా కేంద్రం (RRS) డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్‌జిత్ సింగ్ నేతృత్వం వహిస్తారు. అతని బృందంలో సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు డాక్టర్ సంజయ్ సత్పుటే, డాక్టర్ అబ్రార్ యూసుఫ్ ఉంటారు.

మిషన్ కాకతీయపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు రానున్న పంజాబ్ నిపుణుల బృందం
X

తెలంగాణలోని మిషన్‌ కాకతీయ కింద నిర్మించిన చెరువులు, చెక్‌ డ్యామ్‌లు, భూగర్భ జలాల రీచార్జింగ్‌ టెక్నాలజీలను పరిశీలించేందుకు పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నుంచి ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ బృందం ఫిబ్రవరి 28న హైదరాబాద్‌కు చేరుకుని మార్చి 1, 2 తేదీల్లో మిషన్‌ కాకతీయ పరిధిలోని వివిధ నీటి వనరులను సందర్శించనుంది.

ముగ్గురు సభ్యుల బృందానికి బల్లోవల్ సౌంఖ్రీలోని ప్రాంతీయ పరిశోధనా కేంద్రం (RRS) డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్‌జిత్ సింగ్ నేతృత్వం వహిస్తారు. అతని బృందంలో సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు డాక్టర్ సంజయ్ సత్పుటే, డాక్టర్ అబ్రార్ యూసుఫ్ ఉంటారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఫిబ్రవరి 16న గజ్వేల్ నియోజకవర్గంలోని పాండవుల చెరువు ద్వారా నీటిపారుదల శాఖ అభివృద్ధి చేసిన కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలను పరిశీలించడానికి ఎర్రవల్లి వద్ద నిర్మించిన కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్, చెక్ డ్యామ్‌లను సందర్శించారు. మిషన్ కాకతీయ‌ కింద చేపట్టిన ట్యాంక్ పునరుద్ధరణ పనులను అధ్యయనం చేశారు. పంజాబ్‌కు తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణలో మిషన్ కాకతీయ కార్యక్రమం, రాష్ట్రంలో బహుళస్థాయి నీటి వనరుల అభివృద్ధి ఎలా జరిగిందో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణ‌లో మిషన్ కాకతీయ కార్యక్రమం అమలు ఫలితాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్రాన్ని సందర్శిస్తోంది. వీరి పర్యటనకు నీటిపారుదల, భూగర్భ జల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మిషన్ కాకతీయ కార్యక్రమం విజయవంతంగా అమలు చేసిన రెండు మూడు జిల్లాలకు పంజాబ్ బృందాన్ని తీసుకువెళతామని రాష్ట్ర నీటిపారుదల ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ తెలిపారు.

First Published:  25 Feb 2023 1:17 PM GMT
Next Story