Telugu Global
Telangana

రాష్ట్రపతికి పుల్లారెడ్డి కోడలు ఫిర్యాదు

లేఖలోని అంశాలను వివరిస్తూ ఒక వీడియోను కూడా ప్రజ్ఞారెడ్డి విడుదల చేశారు. రెండేళ్లుగా వేధిస్తున్నారని.. మే నెల నుంచి ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని వెల్లడించారు.

రాష్ట్రపతికి పుల్లారెడ్డి కోడలు ఫిర్యాదు
X

పుల్లారెడ్డి స్వీట్ అధినేత రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తన అత్తమామలపై లేఖలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.

రాష్ట్రపతి ముర్ము ఈనెల 29న నారాయణమ్మ కాలేజ్‌ను సందర్శించనున్నారు. ఈ కాలేజ్‌ను నిర్వహిస్తున్నది పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అతడి కుటుంబ సభ్యులే. రాఘవరెడ్డి కుమారుడు ఏక్‌నాథ్ రెడ్డితో 2014లో ప్రజ్ఞారెడ్డికి వివాహం జరిగింది. ఈమె తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. వివాహం తర్వాత కొద్దికాలానికి ఏక్‌నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డి మధ్య గొడవలు మొదలయ్యాయి.

తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ అత్తింటి వారిపై ప్రజ్ఞారెడ్డి గతంలో పంజాగుట్ట పీఎస్‌లో కేసు పెట్టారు. ఆ సమయంలో తాము, తన కుమార్తె బయటకు రాకుండా రాత్రికి రాత్రి గదికి అడ్డంగా గోడ కూడా కట్టేశారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత గోడను తొలగించిప్పటికీ అనేక ఇతర మార్గాల్లో తనను వేధిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి చెబుతున్నారు. నారాయణమ్మ కాలేజ్‌ను సందర్శిస్తున్న రాష్ట్రపతి ఒక మహిళగా తన పరిస్థితి అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.

లేఖలోని అంశాలను వివరిస్తూ ఒక వీడియోను కూడా ప్రజ్ఞారెడ్డి విడుదల చేశారు. రెండేళ్లుగా వేధిస్తున్నారని.. మే నెల నుంచి ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని వెల్లడించారు. తన కుమార్తెను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా తాను పోరాటం చేస్తున్నానని.. కోర్టు నుంచి తనకు ఊరట లభిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదన్నారు. అత్త భారతి రెడ్డి, మామ రాఘవరెడ్డి, వారి కుమార్తె విద్యారెడ్డి నుంచి తనకు వేధింపులు ఎక్కువ‌వుతున్నాయని ప్రజ్ఞారెడ్డి వివరించారు.

కర్నూలు జిల్లాకు చెందిన పుల్లారెడ్డి.. స్వీట్‌ వ్యాపారాన్ని చిన్నగా మొదలుపెట్టి పలు రాష్ట్రాల్లోప్రఖ్యాతి గాంచే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆ వ్యాపారాలను ఆయన కుమారుడు రాఘవరెడ్డి చూస్తున్నారు.

First Published:  27 Dec 2022 6:01 AM GMT
Next Story