Telugu Global
Telangana

వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ అరెస్ట్

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో కనపడకుండా పోయిన మహిళ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ అరెస్ట్
X

వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపిన తాండూరు మహిళా మిస్సింగ్ కేసు దర్యాప్తులో భ‌యంక‌ర‌మైన‌ దారుణాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఉపాధి పేరుతో కిష్టప్ప అనే ఓ సైకో కిల్లర్ ఇప్పటివరకూ ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నవంబర్ 29వ తేదీన తాండూరుకు చెందిన సర్వబీ అనే మహిళ.. కూలి పనుల కోసం అడ్డాకి వెళ్లింది. కానీ, మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో డిసెంబర్ 1న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో కనపడకుండా పోయిన మహిళ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ధరూర్ మండలం పెద్దేముల్ గ్రామానికి చెందిన కిష్టప్పగా గుర్తించారు. అత‌న్ని విచారించ‌గా.. తాను కేవలం ఆమెతో మాట్లాడాను కానీ, ఆ తరువాత ఏం జరిగిందో తెలియదన్నాడు.

అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి తమదైనశైలిలో పోలీసులు విచారణ చేపట్టడంతో నిందితుడు అసలు విషయాన్ని చెప్పాడు. మహిళను అడవిలోకి తీసుకెళ్లి చీరను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశానని అంగీకరించాడు. మహిళ వద్ద ఉన్న నగదు, కాళ్లకు ఉన్న వెండి పట్టీలు తీసుకుని అక్క‌డి నుంచి పారిపోయినట్లు తెలిపాడు. డిసెంబర్ 7న సర్వబీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

జిల్లాలో ఇదే తీరుగా గతంలో నమోదైన కేసుల్లోనూ మహిళల్ని కిష్టప్పే హత్యచేసి ఉంటాడని భావించిన పోలీసులు వరుస హత్యల కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉపాధి పేరుతో మహిళల్ని నమ్మించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, వెండి, నగదు లాక్కుంటున్నాడ‌ని, మృతదేహాల్ని మూటకట్టి ఎవరికీ అనుమానం రాకుండా నిర్జన ప్రాంతాల్లో పడేస్తాడని పోలీసులు చెబుతున్నారు. కిష్టప్ప ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.

First Published:  8 Dec 2023 12:36 PM GMT
Next Story