Telugu Global
Telangana

హైదరాబాద్‌లో శ్రీలంక-తెలంగాణ స్నేహ కేంద్రానికి ప్రతిపాదన

తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రత్యేకతను మంత్రికి మల్లేపల్లి లక్ష్మయ్య వివరించారు.

హైదరాబాద్‌లో శ్రీలంక-తెలంగాణ స్నేహ కేంద్రానికి ప్రతిపాదన
X

తెలంగాణ, శ్రీలంక ప్రభుత్వాలు ఒక అవగాహన కుదుర్చుకొని.. హైదరాబాద్‌లో శ్రీలంక-తెలంగాణ స్నేహ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ బుద్ధశాసన, సాంస్కృతిక శాఖ మంత్రి విదుర విక్రమ నాయకే ప్రతిపాదించారు. ఇలా నెలకొల్పే కేంద్రంలో సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలను చేపట్టవచ్చని ఆయన సూచించారు. బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య సోమవారం కొలంబోలో మంత్రి విక్రమ నాయకేను ఆయన కార్యాయంలో కలిశారు.

తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రత్యేకతను మంత్రికి మల్లేపల్లి లక్ష్మయ్య వివరించారు. అక్టోబర్ 14న బుద్ధవనంలో 2500 ఏళ్ల బౌద్ధ ప్రస్థాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రి విక్రమ నాయకేను ఆహ్వానించారు. తెలుగు ప్రజలకు, శ్రీలంకకు మధ్య ఉన్న 1700 సంవత్సరాల బౌద్ధ సంబంధాలను ఆయన గుర్తు చేశారు.

శ్రీలంక బుద్ధ శాసన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సోమరత్నె విదన పతిరనను కలిసి బుద్ధవనం ప్రాజెక్టు విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా 2600 ఏళ్ల బుద్ధత్వం అనే పుస్తకాన్ని మల్లేపల్లి లక్ష్మయ్యకు కార్యదర్శి సోమరత్నె బహుకరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్టు కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, శ్రీలంక సెంట్రల్ కల్చరల్ ఫండ్ డైరెక్టర్ జనరల్ ఆచార్య గామిని రణసింఘే తదితరులు పాల్గొన్నారు.

First Published:  25 Sep 2023 1:19 PM GMT
Next Story