Telugu Global
Telangana

తెలంగాణలో ప్రాజెక్టులు, పథకాలు అద్భుతం : ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ క్యూ డొంగ్యూ

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్కువ కాలంలోనే నిర్మించడం.. మూడేళ్ల కాలవ్యవధిలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అద్భుతమని అన్నారు.

తెలంగాణలో ప్రాజెక్టులు, పథకాలు అద్భుతం : ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ క్యూ డొంగ్యూ
X

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు, ఇతర కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ క్యూ డొంగ్యూ కితాబిచ్చారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండ పోచమ్మ ప్రాజెక్టును ఆయన తన బృందంతో కలిసి సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్కువ కాలంలోనే నిర్మించడం.. మూడేళ్ల కాలవ్యవధిలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అద్భుతమని అన్నారు. రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రధానంగా నీరే అవసరం. అది పుష్కలంగా అందించడానికి తెలంగాణ సర్కారు చేసిన కృషి అచరణీయమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.

తాను ఒక రైతు కుటుంబం నుంచే వచ్చానని.. తల్లిదండ్రులు రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి వరి ధాన్యం పండించే వారు. తాను రైతు బిడ్డగానే 50 ఏళ్ల కింద వ్యవసాయం చేసి ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. వ్యవసాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని క్యూ డొంగ్యూ వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో తనలాగే తెలంగాణ బిడ్డ ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని రైతుల ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నానని కొనియాడారు.

అంతకు ముందు క్యూ డొంగ్యూ బృందం కొండపోచమ్మ పంప్ హౌస్‌ను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, ఈఎన్సీ హరిరాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రయోజనాలను వివరించారు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ఆ ప్రాజెక్టు పూర్తి వివరాలను ప్రెజెంట్ చేశారు. భారీ మోటార్లు పని చేస్తున్న విధానాన్ని తెలుసుకొని డొంగ్యూ ఆశ్చర్యపోయారు. ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.


First Published:  16 Jun 2023 2:57 AM GMT
Next Story