Telugu Global
Telangana

చట్నీ ఎక్కువైంది.. భార్య చనిపోయింది..

ఉదయం నుంచి భార్య చందన రమణకు వీడియో కాల్స్‌ చేస్తూనే ఉంది. కానీ, రమణ స్పందించలేదు. దీంతో ఫోన్ చేసిన చందన.. నువ్వు కావాలనే నాతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా అరిచింది.

చట్నీ ఎక్కువైంది.. భార్య చనిపోయింది..
X

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. షాపింగ్‌కు తీసుకెళ్లలేదనో, అడిగినవి కొనిపెట్టలేదనో, పుట్టింటికి వద్దన్నాడనో.. సంసారం అన్నాక సవాలక్ష గొడవలుంటాయి. తగువులాడుకుంటారు, మళ్లీ కలిసిపోతారు. కానీ, ఇక్కడ మాత్రం భార్య ప్రాణమే పోయింది. ప్రాణం పోయేంత గొడవ జరిగిందా అంటే.. వాస్తవానికి అక్కడ అసలు గొడవే జరగలేదు. కానీ, భర్త అన్న ఒక్క మాటతో భార్య ఉరేసుకుని చనిపోయింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన లవ్ చేసుకున్నారు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్‌ దగ్గర డ్రైవర్‌గా రమణ పనిచేస్తున్నాడు. చందన ఓ జువెల్లరీ షాపులో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ భార్యతో రమణ గొడవపడ్డాడు. సోమవారం ఉదయం యథావిధిగా పనికి వెళ్లిపోయాడు.

ఉదయం నుంచి భార్య చందన రమణకు వీడియో కాల్స్‌ చేస్తూనే ఉంది. కానీ, రమణ స్పందించలేదు. దీంతో ఫోన్ చేసిన చందన.. నువ్వు కావాలనే నాతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా అరిచింది. నేను చనిపోతున్నా అని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ ఇంటి ఓనర్‌కు ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి వెళ్లాలని కోరాడు. ఓనర్ పక్కింటి వాళ్ల సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే చనిపోయి ఉంది. భర్త రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First Published:  9 Jan 2024 7:19 AM GMT
Next Story