Telugu Global
Telangana

తెలంగాణలో వైన్ షాపుల కోసం ప్రక్రియ ప్రారంభం.. ఎక్సైజ్ కార్యాలయాల్లో దరఖాస్తుల కోసం క్యూ

తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 4 (శుక్రవారం) నుంచి వైన్ షాపుల కోసం దరఖాస్తుల అమ్మకం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

తెలంగాణలో వైన్ షాపుల కోసం ప్రక్రియ ప్రారంభం.. ఎక్సైజ్ కార్యాలయాల్లో దరఖాస్తుల కోసం క్యూ
X

తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం తీసుకొని వచ్చే శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటి. మద్యం అమ్మకాల ద్వారానే కాకుండా.. వైన్స్, బార్ల లైసెన్సుల జారీ ద్వారా కూడా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి వైన్ షాపుల కోసం టెండర్లు పిలుస్తుంటారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ చివరి వరకు వైన్ షాపులకు అనుమతి ఉన్నది. అయితే అప్పటిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే వైన్ షాపుల లైసెన్సుల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందనే అంచనాల మేరకు.. అధికారులు రెండు నెలల ముందుగానే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 4 (శుక్రవారం) నుంచి వైన్ షాపుల కోసం దరఖాస్తుల అమ్మకం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు రుసుం, లైసెన్సు ఫీజులో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి దరఖాస్తులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయంలో 33 శాతం రంగారెడ్డి జిల్లా నుంచే వస్తుంది. ఇక్కడ వైన్ షాపులకు భారీగా డిమాండ్ ఉంది. ఈ రోజు 10 దరఖాస్తులు సమర్పించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రమంతటా ఆగస్టు 21న డ్రా తీసి వైన్ షాపులు కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారులు స్వయంగా అప్లికేషన్లు తీసుకొని రావాలని.. తమ వెంట ఆధార్ కార్డు, పాన్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ తప్పకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఒక వ్యక్తి ఎన్ని దుకాణాల కోసం అయినా దరఖాస్తు పెట్టుకోవచ్చని అధికారులు వివరించారు. కొత్తగా వచ్చే లైసెన్సులు 2023 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు చెల్లుబాటులో ఉండనున్నాయి. జనాభా ఆధారంగా వైన్ షాపు లైసెన్సు ధరలను 6 స్లాబులుగా వర్గీకరించారు.

ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షల ఫీజు.. ఐదు వేల నుంచి యాబై వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, యాబై వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్ష జనాభా కలిగిన పట్టణాల్లో రూ.65 లక్షలు, 5 నుంచి 20 లక్షల మేర జనాభా కలిగిన చోట్ల రూ.85 లక్షల ఫీజు.. ఇక 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో రూ.1.10 కోట్లను లైసెన్సు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.

First Published:  4 Aug 2023 12:02 PM GMT
Next Story