Telugu Global
Telangana

ప్రియాంక పర్యటన రద్దు.. రేవంత్ చేతుల మీదుగా లాంఛనం

గ్యారెంటీల సభతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించాలనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ప్రియాంక రాకపోయినా సభ సక్సెస్ చేసి, మరోసారి ఆమెను తెలంగాణకు ఆహ్వానించాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

ప్రియాంక పర్యటన రద్దు.. రేవంత్ చేతుల మీదుగా లాంఛనం
X

రూ.500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ స్కీమ్‌లను ప్రియాంక గాంధీ చేతులమీదగా ప్రారంభించాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం ఫలించలేదు. చివరి నిమిషంలో ప్రియాంక పర్యటన రద్దయింది. దీంతో రేపు చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రెండు పథకాల లాంఛనంగా ప్రారంభిస్తారు. బహిరంగ సభ యథాతథంగా జరిగే అవకాశముంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచింది. మిగతా గ్యారెంటీల అమలుకి 100 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా గ్యారెంటీలన్నీ అమలు చేయాలంటూ ప్రతిపక్షం ఓవైపు ఒత్తిడి చేస్తోంది. దీంతో ప్రస్తుతానికి మరో రెండు గ్యారెంటీలను తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ నేతలు. గ్యాస్ సిలిండర్ పై రాయితీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను విధి విధానాలు రూపొందించారు.

గ్యాస్ సిలిండర్ పథకం విషయంలో విధి విధానాలు ఎలా ఉన్నా.. బడ్జెట్ కేటాయింపులు మాత్రం అరకొరగా ఉండటంతో ఆ పథకం అమలుపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. ఇక కరెంటు విషయంలో కూడా బోలెడన్ని అనుమానాలున్నాయి. వాటన్నిటినీ సమాధాన పరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, నిరుపేదలందరికీ నిజంగానే న్యాయం జరుగుతుందా.. అనేది వేచి చూడాలి. అయితే ఆ రెండు గ్యారెంటీలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం నెరవేరకపోవడం విశేషం. ఈ గ్యారెంటీల సభతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించాలనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ప్రియాంక రాకపోయినా సభ సక్సెస్ చేసి, మరోసారి ఆమెను తెలంగాణకు ఆహ్వానించాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  26 Feb 2024 10:00 AM GMT
Next Story