Telugu Global
Telangana

పాడిందే పాట.. ఐదేళ్ల నాడు చెప్పినవే.. మళ్లీ ఇప్పుడు కొత్తగా.!

తాజాగా పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటన చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు మేలు జరగుతుందంటూ ప్రకటన చేశారు.

పాడిందే పాట.. ఐదేళ్ల నాడు చెప్పినవే.. మళ్లీ ఇప్పుడు కొత్తగా.!
X

ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ పాత పాటే పాడారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇవే మాటలు చెప్పిన ప్రధాని మోడీ.. మళ్లీ వాటినే కొత్తగా ప్రకటించారు. దీంతో మోడీ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తెలంగాణకు పెద్దగా ఇచ్చిందేమి లేదని, ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అడుగుతున్న వాటినే మళ్లీ మోడీ ప్రకటించారని అంటున్నారు. ఎన్నికలు వస్తేనే బీజేపీ నేతలకు పసుపు బోర్డు గుర్తుకు వస్తుందంటూ మండిపడుతున్నారు.

2019 ఎన్నికలకు ముందు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అప్పటి బీజేపీ అభ్యర్థి అర్వింద్‌, ఆయన తరఫున ప్రచారానికి వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంటి కేంద్రమంత్రులు హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన 5 రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకువస్తానంటూ అర్వింద్‌ బాండ్ పేపర్ సైతం రాసిచ్చాడు. అయితే కేవలం పసుపు బోర్డు హామీతో ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అర్వింద్‌.. తర్వాత మాట మార్చేశారు. అసలు దేశంలో బోర్డులకు కాలం చెల్లిందని.. బోర్డును మించి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేశామంటూ నమ్మబలికారు. ఐదేళ్లు గడిచిపోయింది. మళ్లీ ఎన్నికలు సమీపించాయి.. నిజామాబాద్‌కు పసుపు బోర్డు మాత్రం రాలేదు.

తాజాగా పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటన చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు మేలు జరగుతుందంటూ ప్రకటన చేశారు. మరీ ఇప్పటికే బోర్డు కంటే మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేశామంటూ అర్వింద్ చెప్పిన‌వ‌న్నీ ఉత్తి మాటలేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ సైతం విభజన చట్టంలో పెట్టిందే. తొమ్మిదేళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ అతీగతి లేదు. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ మోడీ ప్రకటించారు. ఇక ఎన్నికల వేళ మోడీ చేసిన ప్రకటనలపై తెలంగాణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  1 Oct 2023 11:05 AM GMT
Next Story