Telugu Global
Telangana

త్వరలో చీకట్లు తొలగిపోతాయట !!

తెలంగాణలో వెలుగుతున్న 24 గంటల విద్యుత్ వెలుగులు చూసి మోడీకి నిద్ర పట్టడం లేదు. గుజరాత్ మోడల్ డొల్ల. మునుగోడు ఎన్నికతోనే బీజేపీ పీడ విరగడ అయ్యింది. దేశంలో మోడీని నిలువరించే శక్తి కేసీఆర్ కు మాత్రమే ఉంది.

త్వరలో చీకట్లు తొలగిపోతాయట !!
X

మునుగోడులో బీజేపీ గెలవలేదు కనుక తెలంగాణ రాష్ట్రమే చీకట్లలో మగ్గిపోతున్నట్టు ప్రధాని మోడీ భావించడంలో ఆశ్చర్యం ఏమున్నది? టిఆర్ఎస్ ఓటమి పాలయ్యి ఉంటే తెలంగాణలో సూర్యోదయమై ఉండేది. చీకట్లు తొలగిపోయి ఉండేవి. ప్రధాని మోడీ శనివారం తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు, వేసిన రంకెలు ఆయన కసిని, పగను వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖం వికసిస్తూ కనిపించింది. బేగంపేట రాగానే రౌద్రరసనాన్ని ఒలికించారు. దీనికి కారణం 'నువ్వా నేనా' అని తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర నిర్మాత కేసిఆర్ సవాలు చేయడమే..! బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ స్థాపనకు కేసీఆర్ పూనుకొని, సన్నాహాలు ప్రారంభించగానే మోడీ, అమిత్ షా కూటమి విషం చిమ్ముతోంది.

అయితే మోడీ కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే తెలంగాణ పర్యటనను ముగించుకొని వెళ్లారు.

1.మునుగోడు ఉపఎన్నికకు కారణమేమిటి?

2.18000 కోట్ల కాంట్రాక్టును కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇచ్చారా.. లేదా?

3.మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని అమిత్ షా ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? అలాంటి స్కెచ్ వేశారా?

4.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎందుకు ప్రయత్నించారు? మొయినాబాద్ ఫామ్ హౌజ్ బాగోతంలో పాల్గొన్న దళారులతో బీజేపీ నాయకత్వానికి సంబంధమే లేదా?

5.కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి ఏమి సాధించదలుచుకున్నారు?

6.దేశవ్యాప్తంగా అప్రజాస్వామికంగా 9 రాష్ట్ర ప్రభుత్వాలను 'స్వాధీన'పరచుకోలేదా? అదే ఫార్ములాతో కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని బీజేపీ హైజాక్ చేయదలచుకున్నదా?

ఈ ప్రశ్నలకు ప్రధాని జవాబిచ్చి 'సూర్యోదయం'గురించి మాట్లాడితే సముచితంగా ఉండేదేమో!

''తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో బీజేపీ శ్రేణులు వీరోచితంగా పోరాడాయి. రాష్ట్రానికి అవినీతి నుంచి ముక్తి కల్పించటం మా కర్తవ్యం. బీజేపీ కార్యకర్తల పనితీరు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నేను కూడా మీలాగే బీజేపీకి చెందిన చిన్న కార్యకర్తను. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై కార్యకర్తలు గట్టిగా పోరాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నమ్మకద్రోహం చేస్తోంది. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలియ జేయాలి. కేబినెట్‌లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయి'' అని ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పట్ల ఆయనకున్న విద్వేషాన్ని బట్టబయలు చేస్తోంది.

తెలంగాణలో వెలుగుతున్న 24 గంటల విద్యుత్ వెలుగులు చూసి మోడీకి నిద్ర పట్టడం లేదు. గుజరాత్ మోడల్ డొల్ల. మునుగోడు ఎన్నికతోనే బీజేపీ పీడ విరగడ అయ్యింది. దేశంలో మోడీని నిలువరించే శక్తి కేసీఆర్ కు మాత్రమే ఉంది. వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చాయి మునుగోడులో పొరపాటున బీజేపీ గెలిస్తే ఏమి జరిగేది? మతోన్మాదం కట్టలు తెంచుకునేది. నిజానికి రాజకీయాల ఫాసిజీకరణ శిఖరాగ్రం చేరుకున్న తరుణంలో తెలంగాణ నిర్ణయాత్మక బిందువు వద్దకు చేరుకున్నది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ శక్తుల ఫాసిస్టు విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తిరగబడవలసిన సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. హిందు-ముస్లిం ఐక్యతకు ప్రేరణదాయకమైన చిహ్నంగా ఉన్న తెలంగాణలో ఇటీవల కాలంలో మతోన్మాద‌ వాతావరణం ఏర్పడిందని, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా ముస్లిం రైతాంగం హిందూ రైతాంగంతో కలిసి భుజం భుజం కలిపి నైజాం, రజాకార్ల అన్యాయ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందని, తెలంగాణ ఒక గంగ-యమునా తెహజీబ్ సంస్కృతి అని కొత్తగా చెప్పవలసిన పని లేదు. మత సామరస్యం తెలంగాణ ప్రజల రక్తంలో, చైతన్యంలో ఉన్నది. చెప్పుకొచ్చారు. తెలంగాణను మతోన్మాదమయం చేయడమే బీజేపీ ఎజెండా.''ఈ మతోన్మాద రాజకీయాలను విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక సంఘాలు బలంగా వ్యతిరేకించాలి. తెలంగాణ మూలమూలలూ ఫాసిస్టు బీజేపీ శక్తులకు వ్యతిరేకంగా సన్నద్ధమై.. బీజేపీని సమాధి చేయగలం``అని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా స్పష్టం చేసింది.

''ప్రధాని మోడీ ప్రతి మాట కేసీఆర్ పై విషం చిమ్మేలా ఉన్నది. మునుగోడులో బీజేపీ ఓటమి చెందిందనే అక్కసును ప్రధాని వెళ్లగక్కారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని టీఆర్ఎస్ లో అలజడి చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతాం. అబద్ధాల పునాదుల మీద బీజేపీ విస్తరణకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ఎన్నికతోనే బీజేపీ పతనం ప్రారంభం అయింది. అందుకే తెలంగాణపై కుట్రలకు తెరలేపారు'' అని మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు.

తెలంగాణలో చీకట్లు తొలగిపోవడమేమిటో, సూర్యోదయం ఏమిటో చాలామందికి అర్ధం కావడం లేదు. ''బీజేపీ.. రవి అస్తమించని సామ్రాజ్యం'' అని మోడీ అనుకుంటే అది ముమ్మాటికీ భ్రమ.'రవి అస్తమించని సామ్రాజ్యం' గా చెప్పుకున్న బ్రిటీషు మూకలనే తన్ని తరిమేసిన చరిత్ర భారతీయులకు ఉన్నది. ఈ లాజిక్కు మోడీ ఎలా మిస్సయ్యినట్టు?

చీకట్లు గుజరాత్ లో ఉన్నాయి. తెలంగాణలో లేవు. ఆ రాష్ట్రంలో ఎన్ని గంటలు కరెంటు రాకపోకలు ఉన్నదో, తెలంగాణలో క‌రెంట్ ఎలా ఉన్నదో ప్రధానికి తెలియదా? మోడీ వ్యాఖ్యల తాత్పర్యం ఏమిటంటే బీజేపీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో సూర్యోదయం ఉన్నట్టు..! లేకుంటే చీకట్లలో మగ్గిపోతున్నట్టు !! అని అనుకోవాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫెడరల్ స్ఫూర్తిని ఎట్లా దెబ్బతీస్తున్నదో, ఎట్లా చావు దెబ్బ కొడుతున్నదో మోడీ మాటలే నిదర్శనం. దేశవ్యాప్తంగా ఒకే పార్టీ అధికారంలో ఉండాలన్న కుటిల ఆలోచనల నుంచి ఈ మాటలు, చేతలు కనిపిస్తున్నవి. కానీ వాస్తవంలో భారత దేశంలో ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, పలు భాషలతో ప్రపంచంలోనే ప్రత్యేకమైన దేశంగా ఇండియా గుర్తింపు పొందింది. ఈ పరిస్థితిని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాదు.

Next Story