Telugu Global
Telangana

ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మోడీ వల్ల దేశంలో ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క రంగానికి కూడా మేలు జరగలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది నెంబర్‌ 1గా ఎదిగిందని అన్నారు.

ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 15 ఏళ్ల కిందట 2జీ స్పెక్ట్రమ్‌ రూ.1.70 లక్షల కోట్లకు అమ్ముడుపోతే.. అవినీతి జరిగిందని గుజరాత్ ప్రధానిగా ఉన్న మోడీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్‌ను మాత్రం తన మిత్రులైన అంబానీ, అదానీలకు కేవలం రూ.1.40 లక్షలకే కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..

మోడీ తన మిత్రుడు అదానీ స్వలాభం కోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి పేరుతో రూ.3 వేలకే దొరికే బొగ్గును రూ.30 వేలకు కొనాలని జెన్‌కోకు హుకుం జారీ చేశారని మండిపడ్డారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, విమానాశ్రయాలు, ఓడరేవులు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ తన కార్పొరేట్ మిత్రులు అప్పనంగా కట్టబెడుతూ.. దేశ సంపదను దోచి పెడుతున్నాడని ఆరోపించారు.

మోడీ వల్ల దేశంలో ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క రంగానికి కూడా మేలు జరగలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది నెంబర్‌ 1గా ఎదిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా ఫించన్లు, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, కులవృత్తులకు ప్రోత్సాహకాలు.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజల ఇళ్లకే డబ్బులు పంపిస్తున్నారని మంత్రి చెప్పారు.

మరో వైపు మోడీ మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలు పెంచి.. సామాన్యుల ఇంట్లో ఉన్న పైసలు కూడా గుంజుకొని వారిని ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, మోడీ పాలనలో దేశం అదోగతి పాలయ్యిందని అన్నారు. ప్రతీ విషయంలో కేసీఆర్‌ను విమర్శించే బండి సంజయ్‌కు కేసీఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అమలు అవుతున్నాయో చూపించాలని సవాలు చేశారు. పసుపు బోర్డు పేరుతో బాండ్ రాసిచ్చిన ఎంపీ అరవింద్ కుమార్.. పత్తా లేకుండా పోయారని విమర్శించారు.

కేసీఆర్‌తోనే దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిని తమకు వదిలేయాలని.. రాబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చొరవతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

First Published:  26 May 2023 2:30 PM GMT
Next Story