Telugu Global
Telangana

ఫామ్‌హౌస్‌లోనే సతీశ్ విచారణ.. ముగ్గురిపై కేసు నమోదు

ముందుగానే సీసీ కెమేరాలు, బాడీ వార్మ్ కెమేరాలు ఫిక్స్ చేసుకున్నారు. సతీశ్,స్వామీజీ, నందకుమార్ వచ్చి ఇక బేరసారాలు మొదలు పెట్టగా ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారు.

ఫామ్‌హౌస్‌లోనే సతీశ్ విచారణ.. ముగ్గురిపై కేసు నమోదు
X

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లోనే బేరసారాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకు వేదికైన అదే వ్యవసాయ క్షేత్రంలో సతీశ్ అనే అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. నందకుమార్, స్వామీజీలను శంషాబాద్ రూరల్ పీఎస్‌ మరో బృందం విచారిస్తోంది. అసలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎమ్మెల్యేలతో ఎలా సంప్రదింపులు జరిపారనే విషయాలు రాబడుతున్నారు.

నందకుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్నేహితుడికి బంధువుగా తెలుస్తోంది. అతడికు ఉన్న పరిచయం ద్వారానే రోహిత్ రెడ్డిని కలిసి మాట్లాడదామని చెప్పినట్లు సమాచారం. దీంతో రోహిత్ రెడ్డి తన ఫామ్‌హౌస్‌కే పిలిచారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అక్కడకు చేరుకున్నారు. ముందుగానే సీసీ కెమేరాలు, బాడీ వార్మ్ కెమేరాలు ఫిక్స్ చేసుకున్నారు. సతీశ్,స్వామీజీ, నందకుమార్ వచ్చి ఇక బేరసారాలు మొదలు పెట్టగా ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుట్టును రట్టు చేశారు.

బీజేపీలో చేరేందుకు రూ. 100 కోట్ల డీలింగ్ జరిగినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఇతర ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల చొప్పున ఇస్తామని తనను ప్రలోభాలకు గురి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ముగ్గురు కలిసి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని.. డీలింగ్‌లో భాగంగానే సతీశ్, నందు, స్వామీజీ ఫామ్‌హౌస్‌కు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు. రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిపై ప్రవెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం 8, సెక్షన్ 120 బీ కింద కేసు నమోదు చేశారు. ఈ రోజు సాయంత్రంలోగా ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది.

First Published:  27 Oct 2022 5:52 AM GMT
Next Story