Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ కు ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డు

తెలంగాణలో రైతుల అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి నివాసంలో అఖిల భారతీయ రైతు సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి అవార్డును అందజేశారు.

సీఎం కేసీఆర్ కు ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డు
X

అఖిల భారతీయ రైతు సంఘం ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డును 2022 గాను తెల‍ంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రదానం చేశారు. కేసీఆర్ తరపున ఈ రోజు ఈ అవార్డును వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అందుకున్నారు.

తెలంగాణలో రైతుల అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని నిరంజన్‌రెడ్డి నివాసంలో అఖిల భారతీయ రైతు సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం దేశంలోనే అత్యధికంగా ఉపాధి కల్పిస్తోందని, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు లాభదాయకమైన వృత్తిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి సరికొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచానికి ధాన్యాగారంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.

కాగా అవార్డును మంత్రికి అందజేసిన వారిలో ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సంయుక్త్ కిసాన్ మోర్చా సభ్యులు సత్నాం సింగ్ బెహ్రూ, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ అఖిల భారత సలహాదారులు సుఖ్ జిందర్ సింగ్ కాకా, రాచ్ పాల్ సింగ్ ఖల్సా, మీడియా కార్యదర్శి అవతార్ సింగ్ దుండా ఉన్నారు.

స‌ర్ ఛోటు రామ్ అవార్డు ఏంటి ?

పంజాబ్ రైతులు సర్ ఛోటూ రామ్ ను దేవుడిగా ఆరాధిస్తారు. బ్రిటిష్ కాలంలో ఉమ్మడి పంజాబ్ ను పరిపాలించిన నేషనల్ యూనియనిస్ట్ పార్టీకి ఆయన సహా వ్యవస్థాపకుడు. ఆయన నాడు పంజాబ్ రైతుల కోసం నిరంతరం శ్రమించారు. వడ్డీ వ్యాపారుల కబంద హస్తాల్లోంచి రైతులను రక్షించడం కోసం 1934లో పంజాబ్ రిలీఫ్ అప్పుల చట్టం, 1936లో పంజాబ్ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషిచేశారు. తదనంతర కాలంలో ఆ చట్టాల వల్ల పంజాబ్ రైతులు విశేషంగా లాభపడ్డారు. అందుకే పంజాబ్ రైతులు చోటూ రామ్ ను ప్రతి క్షణం స్మరించుకుంటారు. రైతుల కోసం నిరంతరం కృషి చేసే వారికి చోటూ రామ్ పేరుతో ప్రతి ఏడాది అఖిల భారతీయ రైతు సంఘం అవార్డును ప్రధానం చేస్తుంది. ఈ సంవత్సరం ఆ అవార్డు కేసీఆర్ కు లభించింది.

First Published:  5 Jan 2023 1:55 PM GMT
Next Story