Telugu Global
Telangana

తుమ్మలపై ఒత్తిడి పెరిగిపోతోందా?

బీఆర్ఎస్ తరపున పోటీ చేయటం కుదరకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయమని ఆ మధ్య‌ కొందరు మద్దతుదారులు చెప్పారు. అయితే అందుకు తుమ్మల సుముఖంగా లేరు. చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ టికెట్ కోసమే ప్రయత్నించాలన్నది ఆయన ఆలోచన.

తుమ్మలపై ఒత్తిడి పెరిగిపోతోందా?
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయం ఫైనల్ అయిపోయినట్లుంది. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాలన్నది తుమ్మల పట్టుదల. అయితే బీఆర్ఎస్‌లో అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో గెలిచి తర్వాత బీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన కందాళం ఉపేంద్రరెడ్డికే టికెట్ ఫైనల్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యనే తుమ్మల తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి తాను పోటీ చేయటం ఖాయమని చెప్పారు. అయితే ఏ పార్టీ నుండో మాత్రం చెప్పలేదు.

ఇప్పుడు ఆ విషయంపైనే ఆయన మద్దతుదారుల్లో బాగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి పాలేరులో పోటీ చేసే అవకాశం లేనట్లు దాదాపు తేలిపోయింది. ఇక తుమ్మలకు ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్‌లో చేరటమే. ఎందుకంటే బీజేపీలో చేరటం ఆయనకు ఇష్టంలేదు. బీఆర్ఎస్ తరపున పోటీ చేయటం కుదరకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయమని ఆ మధ్య‌ కొందరు మద్దతుదారులు చెప్పారు. అయితే అందుకు తుమ్మల సుముఖంగా లేరు. చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ టికెట్ కోసమే ప్రయత్నించాలన్నది ఆయన ఆలోచన.

ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్లు కొందరు తుమ్మలను అప్రోచ్ అయ్యారట. పార్టీలో చేరితే పాలేరు టికెట్ ఇప్పిస్తామని హామీ కూడా ఇచ్చారట. నిజానికి పాలేరులో కాంగ్రెస్‌కు గట్టి అభ్యర్థి లేరు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమైతే పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు నుండి అసెంబ్లీకి లేదా సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం తెలిసిందే.

అయితే ఆమె విషయంపై ఇంకా క్లారిటిరాలేదు. ఇంతలోనే కాంగ్రెస్‌లోని సీనియర్లు తుమ్మలతో భేటీ అయినట్లు సమాచారం. ఒకవేళ తుమ్మల గనుక కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వటానికి అంగీకరిస్తే పాలేరు టికెట్ ఖాయమనే అంటున్నారు. పనిలోపనిగా కొత్తగూడెంలో జలగం వెంకట్రావును కాంగ్రెస్‌లో చేర్చుకోవటానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఖమ్మం అసెంబ్లీ టికెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖాయమైపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని మద్దతుదారుల నుండి తుమ్మలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోందట. చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First Published:  18 Aug 2023 5:40 AM GMT
Next Story