Telugu Global
Telangana

మా అక్క చనిపోయిందని పూలదండతో వచ్చారా..? గవర్నర్ పై ప్రీతి సోదరి ఆగ్రహం..

దీప్తి ఆగ్రహ జ్వాల తర్వాత వెంటనే రాజ్ భవన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గవర్నర్ వాహనంలో పూలదండ ఉండటం నిజమేనని, అయితే అందుకు కారణం వేరే ఉందని ఓ ప్రకటన విడుదల చేసింది.

మా అక్క చనిపోయిందని పూలదండతో వచ్చారా..? గవర్నర్ పై ప్రీతి సోదరి ఆగ్రహం..
X

కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గవర్నర్ తమిళిసై పరామర్శకు వస్తూ తన వెంట పూలదండ తేవడం మరింత సంచలనానికి కారణమైంది. మా అక్క చనిపోయిందని పూలదండ తెచ్చారా..? అసలలా ఎవరైనా పరామర్శకు వస్తారా..? అంటూ ప్రీతి సోదరి దీప్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరామర్శలు వద్దు వెళ్లిపొండి..

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై పూలదండతో వచ్చారని, ఆమె సోదరి దీప్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు సరైన వైద్యం అందడం లేదని, దయచేసి నాయకులెవరూ పరామర్శించడానికి రావొద్దని ఆమె కోరారు. తన అక్క చావుబతుకుల మధ్య ఉండటానికి మూలకారకుడైన సైఫ్ ని ఉరి తీయాలని దీప్తి డిమాండ్‌ చేశారు.

అబ్బెబ్బే.. ఆ దండ వేరే..

దీప్తి ఆగ్రహ జ్వాల తర్వాత వెంటనే రాజ్ భవన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గవర్నర్ వాహనంలో పూలదండ ఉండటం నిజమేనని, అయితే అందుకు కారణం వేరే ఉందని ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్‌ భవన్‌కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్‌ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించడం ఆమెకు ఆనవాయితీ అని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆమె రాజ్ భవన్ లో ప్రార్థించారని, ఆ సమయంలో పూజారులు ఇచ్చిన పూలమాలను కారులో పెట్టుకుని నేరుగా నిమ్స్ ఆస్పత్రికి ఆమె వచ్చారని స్పష్టం చేశారు. గవర్నర్ పూలదండ తేవడంలో వేరే ఉద్దేశమేదీ లేదన్నారు

First Published:  24 Feb 2023 3:10 PM GMT
Next Story