Telugu Global
Telangana

ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె అసలు గ్రూప్స్ కే అప్లయ్ చేయలేదు..

పరీక్ష వాయిదా పడటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది పూర్తిగా అవాస్తవం. విద్యాకుసుమం రాలిపోయింది, ప్రభుత్వం చంపేసింది అంటూ ఉదయాన్నుంచి రాద్ధాంతం చేసినవారంతా ఇప్పుడు షాకవ్వాల్సిన పరిస్థితి.

ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె అసలు గ్రూప్స్ కే అప్లయ్ చేయలేదు..
X

హైదరాబాద్ లో జరిగిన ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ ఇది. గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆమె, పరీక్షలు వాయిదా పడటంతో ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది అని నమ్మినవాళ్లంతా ఫూల్స్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఆమె అసలు గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తే చేయలేదు. 15రోజుల క్రితమే ఆమె వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి హాస్టల్ లో చేరింది. గ్రూప్స్ కి ప్రిపేర్ కావడానికే వచ్చింది కానీ, ఇటీవల వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షతో ఆమెకు అసలు సంబంధం లేదు. ఆ పరీక్షకు ఆమె ప్రిపేర్ కావడంలేదు. అంటే ఆ పరీక్ష వాయిదా పడటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది పూర్తిగా అవాస్తవం. విద్యాకుసుమం రాలిపోయింది, ప్రభుత్వం చంపేసింది అంటూ ఉదయాన్నుంచి రాద్ధాంతం చేసినవారంతా ఇప్పుడు షాకవ్వాల్సిన పరిస్థితి.

అసలు కారణం ఏంటి..?

ప్రవళిక ఆత్మహత్యకు అసలు కారణం ప్రేమ వ్యవహారం. శివరామ్ అనే అబ్బాయిని ఆమె ప్రేమించింది. వారిద్దరూ ఆమె చనిపోయిన రోజు ఉదయం కూడా కలసి టిఫిన్ చేశారు, ఆ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులకు దొరికింది. శివరామ్, ప్రవళికను కాదని వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ లవ్ స్టోరీ ఫెయిలైంది. ప్రేమలో విఫలమైన ప్రవళిక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. అసలు కథ ఇదయితే.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడటంతో ఆందోళనలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ సంబంధం లేని వార్తలు సోషల్ మీడియా, మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి.

తల్లిదండ్రులకు తెలుసు..

ప్రవళిక ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలుసని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఆమె చనిపోయిన తర్వాత వారు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మిగతా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా, రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ప్రభుత్వంపై విమర్శలు చేసినా కూడా తల్లిదండ్రులు కనీసం కూతురి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టలేదు. ప్రవళిక ఫోన్ లో శివరామ్ తో చేసిన చాటింగ్ ని పోలీసులు గుర్తించారు. ఫోన్ చాటింగ్, ఆమె రాసిన సూసైడ్ లెటర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన శివరామ్, ప్రవళిక వీడియోలను పోలీసులు సేకరించారు, అసలు విషయం కనిపెట్టారు. ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణం అని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సెంట్రల్ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

First Published:  14 Oct 2023 1:41 PM GMT
Next Story