Telugu Global
Telangana

ప్రకాశం జిల్లా రాధ మర్డర్‌ కేసులో భర్తని పట్టించిన గూగుల్‌ టేకౌట్‌..!

ఈ నెల 17న రాధ కనిగిరిలోని తన పుట్టింటికి వెళ్లగా అక్కడికి వెళ్లిన మోహన్ రెడ్డి.. కాశీ రెడ్డిలా మెసేజ్‌లు పంపించి ఆమెని కిరాతకంగా హత్య చేశాడు.

ప్రకాశం జిల్లా రాధ మర్డర్‌ కేసులో భర్తని పట్టించిన గూగుల్‌ టేకౌట్‌..!
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రాధ మర్డర్ కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చేసింది. ఆమె భర్త మోహన్ రెడ్డి తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ (35) ఈ నెల 17న దారుణంగా హత్యకి గురైన విషయం తెలిసిందే. తొలుత ఆమె స్నేహితుడు కాశీరెడ్డిని అనుమానించిన పోలీసులు.. టెక్నాలజీ సాయంతో అసలు నిందితుడు ఆమె భర్త మోహన్‌ రెడ్డి అని తేల్చేశారు. హత్యకి ముందు నిందితుడు చాలా తెలివిగా సిమ్ కార్డులు మార్చినా.. గూగుల్‌ టేకౌట్‌ అతడ్ని పట్టించేసింది.

రాధ తన చిన్ననాటి స్నేహితుడైన కాశీరెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బుని అప్పుగా ఇచ్చింది. అలానే తన భర్త ద్వారా కూడా కొంత మొత్తం అప్పుగా ఇప్పించింది. కానీ.. కాశీ రెడ్డి ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. అయితే కాశీ రెడ్డికి, తన భార్యకి సంబంధం ఉందని అనుమానించిన మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ధారించుకునేందుకు కాశీరెడ్డి పేరుతో సిమ్‌ కార్డు కొని.. తన భార్యతో అతనిలా ఛాటింగ్ చేశాడు. దాదాపు 15 రోజుల పాటు ఈ తంతు కొనసాగింది. కానీ.. రాధ ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయింది. ఈ నెల 17న రాధ కనిగిరిలోని తన పుట్టింటికి వెళ్లగా అక్కడికి వెళ్లిన మోహన్ రెడ్డి.. కాశీ రెడ్డిలా మెసేజ్‌లు పంపించి ఆమెని కిరాతకంగా హత్య చేశాడు.

మోహన్ రెడ్డి స్వస్థలం కోదాడ. దాంతో మర్డర్‌కి ముందు కూడా కోదాడ నుంచి రాధకి కాశీ రెడ్డిలా అతను మేసేజ్‌లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలానే సూర్యా‌పేటలో చెరుకు రసం అమ్మే వ్యక్తి ఫోన్ తీసుకుని.. అందులో కాశీ రెడ్డి పేరుతో కొనుగోలు చేసిన సిమ్‌ వేసి రాధతో ఛాట్ చేశాడు. ఆ తర్వాత పల్నాడులో ఓ టీ కొట్టు వద్ద ఒకరి ఫోన్ తీసుకుని ఇదే పని చేశాడు. చివరికి కనిగిరిలో కూడా ఓ యువతితో మాటలు కలిపి ఆమె ఫోన్‌లో ఆ సిమ్ వేసి కనిగిరి వచ్చానంటూ రాధకి మెసేజ్‌లు పంపాడు. ఓవరాల్‌గా కాశీ రెడ్డి కనిగిరి వచ్చాడని.. తమ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాడని నమ్మి వెళ్లిన రాధ ఆ మొత్తం వ్యవహారం నడుపుతోంది తన భర్త మోహన్ రెడ్డి అని గుర్తించలేకపోయింది. రాధని కిరాతకంగా సిగరెట్లతో కాల్చి, కాలు విరిచేసి, కారుతో తొక్కించి అనంతరం రోడ్డుపై మృతదేహాన్ని పడేయడం ద్వారా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

కానీ.. రాధ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమెని చంపింది మోహన్ రెడ్డి అని నిర్ధారించుకున్నారు. అయినప్పటికీ అంత్యక్రియలు ముగిసే వరకూ వేచి ఉండి ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసుల్ని మోహన్ రెడ్డి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ.. గూగుల్ టేకౌట్ ద్వారా మర్డర్ టైమ్‌లో అతను కనిగిరిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకి గల అసలు కారణాలు, ఎవరెవరు అతనికి సాయం చేశారు? తదితర కేసు వివరాల్ని త్వరలోనే పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.

First Published:  22 May 2023 5:07 AM GMT
Next Story