Telugu Global
Telangana

నా కోసమే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు -కేఏ పాల్..

ఆరు నెలల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అమెరికాలా మార్చేస్తానని చెబుతూ.. ప్రతి మండలంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చారు.

నా కోసమే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు -కేఏ పాల్..
X

కేఏ పాల్ ని పొలిటికల్ కమెడియన్ గా చాలామంది తీసిపారేసినా.. కొన్నిసార్లు ఆయన మాటలు సీరియస్ పాలిటిక్స్ మధ్య ప్రజలకు కాస్త ఊరటనిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆయన కేసీఆర్ వ్యూహాన్ని తన వ్యూహంగా చెప్పుకుంటూ నవ్వులు పూయించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం ఎందుకు ఆలస్యమైందనే విషయంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఆ వివరణ వింటే సీఎం కేసీఆర్ సైతం పడి పడి నవ్వుకోవలసిందే.

నా ఆఫర్ నచ్చినట్టుంది..

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కి కేఏ పాల్ ఓ ఆఫర్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే లక్షకోట్లతో తెలంగాణను అభివృద్ధి చేస్తానన్నారు. ఆరు నెలల్లో మునుగోడుని అమెరికా చేస్తానని చెప్పారు. ఈ ఆఫర్ కేసీఆర్ కి నచ్చే మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారని చెప్పారు పాల్. మునుగోడులో తన 59వ పుట్టినరోజు వేడుకల్ని చేసుకున్న ఆయన ఇలా బాంబు పేల్చారు, మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని, తనకోసమే ఆ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పుకొచ్చారు.

పాపం గద్దర్..

ప్రజా గాయకుడు గద్దర్ ఎంతోమంది మహామహులతో కలసి నడిచారు, వారికి సలహాలు సూచనలు ఇచ్చారు, పెద్ద పెద్ద నేతల అభినందనలు, ప్రశంసలు పొందారు. అలాంటి గద్దర్ ఇప్పుడు కేఏ పాల్ తో కలసి ప్రజా పోరాటం చేస్తానంటూ ముందుకొచ్చారు. ఆమధ్య గద్దర్ కి భారత రత్న ఇవ్వాలంటూ పాల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. గద్దర్ ని తన పార్టీలో చేర్చుకుని రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడతానని కూడా చెప్పారు పాల్. మరి పాల్ లో గద్దర్ కి ఏం నచ్చిందో, ఆయన నాయకత్వ లక్షణాలకు ఎలా పడిపోయారో తెలియదు కానీ.. మునుగోడులో జరిగిన పాల్ 59వ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. స్టేజ్ కింద కంటే.. స్టేజ్ పైనే జనం ఎక్కువమంది ఉండటం ఈ పుట్టినరోజు వేడుకల విశేషం. అయినా కూడా గద్దర్ తమాయించుకుని స్టేజ్ పైనే ఉన్నారు, పాల్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో 59 మందిని అమెరికా పంపించడానికి డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. మునుగోడులో తాను గెలిస్తే ఏమేం చేస్తాననే విషయాలను ఏకరువు పెట్టారు పాల్. ఆరు నెలల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అమెరికాలా మార్చేస్తానని చెబుతూ.. ప్రతి మండలంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చారు.

First Published:  26 Sep 2022 1:59 AM GMT
Next Story