Telugu Global
Telangana

ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారం.. 'ప్రజాపాలన'కు శ్రీకారం

10 రోజుల పాటు గ్రామస్థాయిలో 'ప్రజాపాలన' నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదా నెలలో కొన్ని రోజులు 'ప్రజాపాలన' కార్యక్రమం చేపడతారు.

ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారం.. ప్రజాపాలనకు శ్రీకారం
X

ప్రజా దర్బార్, ప్రజా వాణి, ఇప్పుడు ప్రజా పాలన.. అన్నిట్లో కామన్ పాయింట్ ఒకటే. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించడం. అయితే వాటి పరిష్కారం జెట్ స్పీడ్ లో ఉండేందుకు కొత్తగా 'ప్రజాపాలన'కు శ్రీకారం చుట్టబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహిస్తుంది. ప్రజల సమస్యలను నేరుగా విని.. అక్కడికక్కడే పరిష్కరిస్తుంది. ఇదే 'ప్రజాపాలన' ముఖ్య ఉద్దేశం.

గ్రామ, మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తే ఫిర్యాదుదారులు హైదరాబాద్ వరకు వచ్చే అవసరం ఉండదనేది ప్రభుత్వం ఆలోచన. అందుకే గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల పాటు గ్రామస్థాయిలో 'ప్రజాపాలన' నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదా నెలలో కొన్ని రోజులు 'ప్రజాపాలన' చేపడతారు. జిల్లా కలెక్టర్‌ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల బాధలు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూలు ఉంటుందని అంటున్నారు.

జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 24న 'ప్రజాపాలన'పై సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ప్రజాదర్బార్ కి వచ్చిన దరఖాస్తులపై చర్చిస్తారు. వాటిలో కామన్ గా ఉంటున్న సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తారు. గ్రామ స్థాయిలోనే వాటిని పరిష్కరించగలిగేలా సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తారు. 'ప్రజాపాలన'పై కూడా ఓ అంచనాకు వస్తారు. 10రోజులపాటు 'ప్రజాపాలన' కార్యక్రమం కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇది విజయవంతం అయితే నెలలో కొన్నిరోజులు విధిగా 'ప్రజాపాలన' జరుగుతుంది. సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతాయి.

First Published:  23 Dec 2023 6:38 AM GMT
Next Story