Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ వద్ద పోస్టర్ల కలకలం.. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని ఎద్దేవా చేస్తూ ఆ పోస్టర్లలో రాశారు. అంతే కాకుండా విద్యార్థుల తరపున పలు డిమాండ్లు కూడా అందులో ఉన్నాయి.

టీఎస్‌పీఎస్సీ వద్ద పోస్టర్ల కలకలం.. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
X

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది. వరుసగా ఐదో రోజు కూడా నిందితులను హిమాయత్‌నగర్‌ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరోవైపు నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక తాజాగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద కొంత మంది అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని ఎద్దేవా చేస్తూ ఆ పోస్టర్లలో రాశారు. అంతే కాకుండా విద్యార్థుల తరపున పలు డిమాండ్లు కూడా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని.. ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రవేశ పత్రాలు లభిస్తాయని ఎగతాళి చేస్తూ పోస్టర్లు ముద్రించారు. ఇది ఉద్యోగ నియామక కార్యాయలం కాదని.. జిరాక్స్ సెంటర్ అంటూ విమర్శించారు. ఓయూ జేఏసీ సభ్యుల పేరుతో ఈ పోస్టర్లను అంటించారు.

ముఖ్యమంత్రి గారూ.. వెంటనే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. అంతే కాకుండా ఈ నెల నుంచి నష్టపోయిన విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ నష్టపరిహారం ఇవ్వాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ఈ పోస్టర్లను అక్కడి నుంచి తొలగించారు. బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఇలా పోస్టర్లు అంటించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Next Story