Telugu Global
Telangana

నేడు రాహుల్‌తో భేటీ కానున్న పొంగులేటి, జూపల్లి.. వెంట వెళ్లనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ పరిస్థితిని గ్రహించిన పొంగులేటి వర్గం.. ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించలేదు.

నేడు రాహుల్‌తో భేటీ కానున్న పొంగులేటి, జూపల్లి.. వెంట వెళ్లనున్న రేవంత్ రెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఢిల్లీకి పయనం కానున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వీరిద్దరూ భేటీ కానున్నట్లు సమాచారం. వీరితో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత వీరిద్దరూ బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా పలు దఫాలు వీరితో భేటీ అయ్యారు.

కాగా, తెలంగాణలో బీజేపీ పరిస్థితిని గ్రహించిన పొంగులేటి వర్గం.. ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించలేదు. వీరిద్దరూ చేరతారనే ఆశతో ఖమ్మంలో హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినా.. పొంగులేటి, జూపల్లి హ్యాండ్ ఇవ్వడంతోనే సభ క్యాన్సిల్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, తెలంగాణ కాంగ్రెస్ వీరిద్దరితో మొదటి నుంచి టచ్‌లో ఉన్నది. బుధవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో జూపల్లి, పొంగులేటితో రేవంత్ రెడ్డి లంచ్‌కు కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి వర్గం పెట్టిన డిమాండ్లలో కొన్నింటికి అంగీకారం కుదిరింది. అధిష్టానం వద్ద చర్చించిన తర్వాత మిగిలిన డిమాండ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.

ఢిల్లీ వెళ్లనున్న పొంగులేటి, జూపల్లి మొదటి రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో చర్చలు జరుపుతారు. ఈ భేటీలో కాంగ్రెస్ అత్యున్నత కమిటీ సభ్యులు కూడా ఉంటారని సమాచారం. ఆ తర్వాతే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతారనే విషయంపై స్పష్టత రానున్నది.

ఢిల్లీ లేదా హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో తాను పార్టీలో చేరబోనని.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. అప్పుడే చేరతానని పొంగులేటి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. ఆ మీటింగ్‌లో తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక నేతలు హాజరు కావాలనే షరతు పెట్టినట్లు సమాచారం. వాస్తవానికి పొంగులేటి వర్గం కూడా కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి అధికారికంగా ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వారిద్దరి ఇళ్ల‌కు వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం అందరూ కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లితో పాటు కాంగ్రెస్‌లో రాజేశ్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, హరికళా నర్సారెడ్డి, ఆర్. జగదీశ్వర్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వెంకట్ రావు, విజయ, ఆది నారాయణ, రఘునాథ్ యాదవ్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నది. ఈ రోజు ఢిల్లీలో జరిగే చర్చల అనంతరం ఖమ్మం సభ, చేరికలపై పూర్తి స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

First Published:  22 Jun 2023 4:02 AM GMT
Next Story