Telugu Global
Telangana

అమిత్‌షా వ్యాఖ్యలు కోతలే.. ఆ మాటలను లైట్ తీసుకున్న తెలంగాణ ప్రజలు

అమిత్‌షా వ్యాఖ్యలు కోతలే.. ఆ మాటలను లైట్ తీసుకున్న తెలంగాణ ప్రజలు
X

'తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకోబోతున్నాము. తెలంగాణ ప్రజల నాడి నాకు తెలుసు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు' అంటూ ఇటీవల బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు తాను తెలంగాణకు వెళ్లి మరీ బీజేపీని గెలిపించుకుంటానని చెప్పారు. సౌత్ ఇండియాలో బీజేపీ ఎంట్రీకి తెలంగాణ గేట్‌వే లాంటిదని.. అందుకే ఆ రాష్ట్రంపై ఫోకస్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుంది. మోడీ మరో సారి ప్రధాని అవడం ఖాయమని అమిత్ షా 'టైమ్స్ నౌ' సమ్మిట్‌లో చెప్పుకొచ్చారు.

కాగా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ పోల్ నిర్వహించింది. 'తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న కేంద్ర మంత్రి అమిత్ షా మాటలతో ఏకీభవిస్తారా?' అంటూ ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. దాదాపు 10 వేల మంది ఈ పోల్‌లో పాల్గొనగా.. అమిత్ షా మాటలను 85 శాతం మంది తెలంగాణ ప్రజానికం వ్యతిరేకించారు. కేవలం 15 శాతం మంది మాత్రమే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఓటేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌ను ఓడించి.. బీజేపీ అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర నాయకుల కంటే ఎక్కువగా కేంద్రంలోని అగ్రనాయకత్వం తెలంగాణపై ఫోకస్ చేసింది. తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ నిత్యం కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన విషయంలో కూడా బీజేపీని కేసీఆర్ ఢిల్లీ వేదికగా దోషిగా నిలబెట్టారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే జాతీయ మీడియా వేదికలపై తమ ఇమేజ్‌ను పెంచుకోవడానికి బీజేపీ నానా కష్టాలు పడుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ పదే పదే తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ప్రగల్భాలు పలుకుతోంది. అమిత్ షా నోటి వెంట అలాంటి వ్యాఖ్యలు రావడానికి కారణం ధీమా కాదని.. కావాలనే ప్రజలను మానిప్యులేట్ చేసే ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా ఆన్‌లైన్ పోల్‌లో అమిత్ షా వ్యాఖ్యలను 85 శాతం మంది ఖండించడం ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. తెలంగాణ ప్రజలను ఏమార్చాలనే వ్యూహంలో భాగంగానే జాతీయ మీడియాను ఉపయోగించుకోవాలనే వ్యూహానికి కూడా ఇదొక చెంప పెట్టు అనుకోవచ్చు.

First Published:  27 Nov 2022 12:41 PM GMT
Next Story