Telugu Global
Telangana

తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. అసెంబ్లీ కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు!

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి, గవర్నర్ కోటా నుంచి కౌన్సిల్‌కు ఎన్నికైన డి. రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీ కాలం మే నెలలో ముగియనున్నది.

Telangana MLC Elections
X

తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నాయి. మరో ఏడాదిలోపే అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటంతో అప్పుడే ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరో ఎన్నికల సమరానికి తెలంగాణలో తెరలేవనున్నది. రాష్ట్రంలో రాబోయే ఐదు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. కౌన్సిల్ అనేది శాశ్వత సభ కాబట్టి.. వాటికి ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది.

2023 మార్చిలోగా నాలుగురు, మేలోగా ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనున్నది. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా ఉన్న పలువురు బీఆర్ఎస్ నేతలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తప్పకుండా గెలుస్తామనే కారణంతోనే వీళ్లు అసెంబ్లీ బరిలో దిగాలని నిర్ణయించకున్నారు. అదే జరిగితే.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఒక ఏడాది పాటు రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల వాతావరణమే నెలకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఉపాధ్యాయుల నియోజకవర్గానికి తప్ప మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ఏ. క్రిష్ణారెడ్డి, వి. గంగాధర్ గౌడ్, కే. నవీన్ కుమార్‌ల పదవీ కాలం మార్చితో ముగియనున్నది. ఈ ఖాళీల భర్తీ కోసం తొలుత నోటిఫికేషన్ వెలువడుతుందని ఈసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీ కాలం మార్చిలో ముగియనున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ కానున్నది.

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి, గవర్నర్ కోటా నుంచి కౌన్సిల్‌కు ఎన్నికైన డి. రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీ కాలం మే నెలలో ముగియనున్నది. దీనికి సంబంధించి ఏప్రిల్‌ లేదా మే మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. అంటే రాబోయే ఐదు నెలలు ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి తెలంగాణలో ఉండబోతోంది. గవర్నర్, ఎమ్మెల్యేల కోటాలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నది. ఇక స్థానిక సంస్థల, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం పోటీ ఉంటుంది.

మరో వైపు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎల్. రమణ, పట్నం మహేందర్ రెడ్డి, పాడి కౌషిక్ రెడ్డి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్నారు. వీళ్లు గెలిస్తే.. ఆయా ఖాళీలకు మళ్లీ నోటిఫికేషన్ వెలువుడుతుంది. కవితకు 2028 వరకు పదవీ కాలం ఉన్నా.. ఎమ్మెల్యే సీటుపైనే ఆమె ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ ఎంపీగా కానీ, అసెంబ్లీకి కానీ పోటీ చేయాలని భావిస్తున్నారు. వీళ్ల గెలుపు తర్వాత ఖాళీ అయ్యే వాటికి 2024 జనవరిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

First Published:  28 Dec 2022 12:14 PM GMT
Next Story