Telugu Global
Telangana

పండగ మీది.. పెట్టుబడి మాది.. బంపర్ ఆఫర్లు ఇస్తున్న రాజకీయ పార్టీలు

అయితే ఈసారి మునుగోడు నియోజకవర్గంలో మాత్రం చందాల కోసం యువకులు కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ఉపఎన్నిక పుణ్యమా అని రాజకీయ పార్టీలే మండపాల ఏర్పాటుకు సహకరిస్తున్నాయి.

పండగ మీది.. పెట్టుబడి మాది.. బంపర్ ఆఫర్లు ఇస్తున్న రాజకీయ పార్టీలు
X

దేశంలో హిందువులు ఏడాదిలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. అయితే అన్ని పండుగలూ ఒక ఎత్త‌యితే.. వినాయక చవితి మరో ఎత్తు. మిగిలిన పండుగలు బంధు మిత్రులతో చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. సెలవులకు పిల్లాపాపలతో సొంతూర్లకు వెళ్తుంటారు. కానీ, వినాయక చవితి మాత్రం వీధి వీధినా కోలాహలంగా జరుపుతారు. ముఖ్యంగా ఎవరి ఇంటికి దగ్గర, వీధిలో వాళ్లు విగ్రహాన్ని ప్రతిష్టించి ఈ నవరాత్రులు భక్తితో పాటు ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా యువకులు పోటాపోటీగా విగ్రహాలు పెట్టి.. చివరి రోజు ఘనంగా నిమజ్జనం చేస్తారు. ఈ నవరాత్రులు అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విగ్రహం కొనుగోలు నుంచి మండపాల ఏర్పాటు, డెకరేషన్, పూజా కార్యక్రమాలు, ప్రసాదం, నిమజ్జనం రోజు వాహనాల ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అందుకే యువకులు ముందు నుంచే వినాయక చందాల వేటలో పడతారు.

అయితే ఈసారి మునుగోడు నియోజకవర్గంలో మాత్రం చందాల కోసం యువకులు కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ఉపఎన్నిక పుణ్యమా అని రాజకీయ పార్టీలే మండపాల ఏర్పాటుకు సహకరిస్తున్నాయి. పండగ మీరు చేసుకోండి.. పెట్టుబడి మేం పెడతాం అంటూ ముందుకు వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు మండపాలను స్పాన్సర్ చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన ఈసారి రాజకీయ పార్టీ నాయకుల చందాలతో గణేష్ ఉత్సవాలు భారీగా జరుగనున్నాయి. అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఓ నాయకుడు విగ్రహాలతో పాటు ఒక్కో మండపానికి రూ. 10 వేలు ఖర్చు కింద ఇచ్చినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది. మంగళవారం చౌటుప్పల్ లోని మార్కెట్ యార్డులో భారీగా విగ్రహాల పంపిణీ జరిగింది. అయితే అవి సదరు నాయకుడే అందరికీ ఇప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విగ్రహం ఇప్పించడమే కాకుండా నిమజ్జనం రోజు వరకు అయ్యే ఖర్చును పంపిస్తానని వాగ్దానం చేసినట్లు తెలుస్తున్నది.

ఓ మాజీ ఎమ్మెల్యే ఒక్కో గణేష్ ఉత్సవాల కమిటీకి రూ. 10 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా గణేష్ మండపాలకు భారీగానే స్పాన్సర్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్క చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే రాజకీయ నాయకులు 150 విగ్రహాలకు స్పాన్సర్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది ఇన్ని విగ్రహాలు ప్రతిష్టించలేదని.. ఈ సారి రాజకీయ పార్టీల అండతో విగ్రహాల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఎవరు పోయి విగ్రహం పెడతామని అడిగినా.. కాదనకుండా చందా ఇచ్చినట్లు సమాచారం. కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా.. చౌటుప్పల్ మండలంలోని ఇతర గ్రామాల్లో దాదాపు 300 విగ్రహాలు ఏర్పాటు చేశారు.

ఇక మునుగోడు సెగ్మెంట్‌లోని మునుగోడు, నారాయణపురం, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భారీగానే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయించారు. బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో పాటు అభిమానులు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క మండపానికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు చల్లమల్ల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కూడా విగ్రహాల ఏర్పాటుకు తమ వంతు సాయం చేసినట్లు తెలుస్తున్నది. ఏదేమైనా మునుగోడు ఉపఎన్నిక కారణంగా ఈ సారి పండగంతా నియోజకవర్గ పరిధిలోనే ఉన్నదని స్థానికులు చెప్పుకుంటున్నారు.

First Published:  31 Aug 2022 3:05 AM GMT
Next Story