Telugu Global
Telangana

సింగరేణి ఎన్నికలపై పార్టీల ఫోకస్.. నేడు షెడ్యూల్ విడుదలయ్యే అకాశం!

సింగరేణి సంస్థకు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగే ఎన్నికలు తప్పకుండా కోల్‌బెల్ట్ మూడ్ ఎలా ఉందో తప్పకుండా తెలియజేస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

సింగరేణి ఎన్నికలపై పార్టీల ఫోకస్.. నేడు షెడ్యూల్ విడుదలయ్యే అకాశం!
X

తెలంగాణలో కీలకమైన 11 నియోజకవర్గాల వ్యాప్తంగా విస్తరించిన సింగరేణి సంస్థ కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. అంతకు ముందు నిర్వహించనున్న సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల ప్రభావం కోల్ బెల్ట్‌లో తప్పకుండా ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ పార్టీలు సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

సింగరేణి సంస్థకు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగే ఎన్నికలు తప్పకుండా కోల్‌బెల్ట్ మూడ్ ఎలా ఉందో తప్పకుండా తెలియజేస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, రామగుండం సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇక కొత్తగూడెం, మంథని, భూపాలపల్లి, ఇల్లందు, పినపాకలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.

ఈ సారి కోల్‌బెల్ట్‌లో అత్యధిక సీట్లు గెలవాలని బీఆర్ఎస్ టార్గెట్‌గా పెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, పినపాక, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచినా.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. అయితే ఈ సారి నేరుగా బీఆర్ఎస్ క్యాండిడేట్లే గెలవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. సింగరేణి సంస్థకు జరిగే ఎన్నికలు తప్పకుండా ఇందుకు సహకరిస్తాయని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కోల్‌బెల్ట్ ప్రాంతంలో మంచి పట్టే ఉన్నది. గతంలో ఇక్కడ ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఈ సారి కూడా భారీ సీట్లు గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

గత సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు సంఘంగా గెలిచింది. 11 ఏరియాలకు గాను 9 ఏరియాలు టీబీజీకేఎస్ ఖాతాలో పడ్డాయి. ఎమ్మెల్సీ కవిత అప్పట్లో గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికీ టీబీజేకేఎస్ సింగరేణి గుర్తింపు సంఘంగా ఉండటం, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్‌ వాళ్లే కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో మరోసారి గుర్తింపు సంఘంగా ఎన్నికైతే ఆ ప్రాంతంలో మంచి పట్టు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

కమ్యూనిస్టు పార్టీలు కూడా రాబోయే ఎన్నికల్లో సింగరేణి బెల్ట్‌లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీకి దిగాలని భావిస్తున్నారు. గతంలో సింగరేణిలో వీరిదే ఆధిపత్యం ఉండేది. కానీ క్రమంగా కమ్యూనిస్టు కార్మిక సంఘాల ప్రాబల్యం తగ్గింది. అయినా సరే ఇంకా కొన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడతాయని భావిస్తున్నారు. అందుకే సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.

సింగరేణి సంస్థకు గుర్తింపు సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించలానికి కేంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ లోగా ఎన్నికలు పూర్తి చేయాలని సూచించింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో సింగరేణిలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల సంస్థపై ప్రభావం పడుతుందని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో జూన్‌లోగా ఎన్నికలు జరుపుకునేందుకు సింగరేణికి సంస్థకు వెసులుబాటు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

కేంద్ర కార్మిక శాఖ డిప్యుటీ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. గతంలో ఆయన కార్మిక సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు మరోసారి ఆయన కార్మిక సంఘాలను సమావేశపరచనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సమీక్ష చేయడంతో పాటు షెడ్యూల్ కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, గుర్తింపు సంఘ నాయకులు ఈ సారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఏరియా, కార్పొరేట్ ఎన్నికలు ఇవే పద్దతి అనుసరించాలని కోరారు. అయితే దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని గతంలోనే శ్రీనివాసులు వారికి వెల్లడించారు. సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో 49,877 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

First Published:  2 April 2023 2:52 AM GMT
Next Story