Telugu Global
Telangana

కేబుల్‌బ్రిడ్జ్‌పై ఫొటో దిగితే వెయ్యి ఫైన్, కేసు

తాజా ఘటనతో జనానికి హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. సెల్ఫీలు దిగడానికి కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని తేల్చి చెప్పారు. "సెల్ఫీల కోసం రోడ్లపైకి వెళ్లడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి.

కేబుల్‌బ్రిడ్జ్‌పై ఫొటో దిగితే వెయ్యి ఫైన్, కేసు
X

మాదాపూర్ దుర్గం చెరువుపై కట్టిన కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్‌కు మణిహారంగా నిలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, హైటెక్ సిటీతో పాటు కేబుల్ బ్రిడ్జిని కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో కేబుల్ బ్రిడ్జి తరచూ కనిపిస్తోంది. చాలా మంది కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సెల్ఫీలు తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే కేబుల్ బ్రిడ్జిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, రీల్స్ కోసం యువ‌త‌ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వెళ్లిన ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

అనిల్, అజయ్ అనే ఇద్ద‌రు యువకులు శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12.30 గంటలకు వేగంగా వచ్చిన ఇన్నోవా కారు సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు ఆగకుండా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ప్ర‌మాదంలో తీవ్రగాయాల పాలైన యువకులను పోలీసులు మాదాపూర్ పేస్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అనిల్ మృతి చెందాడు. విజయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.

తాజా ఘటనతో జనానికి హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. సెల్ఫీలు దిగడానికి కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని తేల్చి చెప్పారు. "సెల్ఫీల కోసం రోడ్లపైకి వెళ్లడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వాహనాలకు మాత్రమే.. మీరు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు కాదు. మీవల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకపై ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గం చెరువు మీదకు వస్తే వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు కేసు పెడతాం" అని మాదాపూర్ సీఐ మల్లేష్ హెచ్చరించారు.

First Published:  7 April 2024 6:49 AM GMT
Next Story